Karnataka : కర్ణాటకలోని మండియా జిల్లాలో ఉన్న ఓ ఆలయం వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భీమ అమావాస్య సందర్భంగా ఆలయంలో ప్రత్యేక భద్రతా విధుల్లో ఉన్న మహిళా పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌పై, బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె దాడి చేసినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.

ఈ ఘటన ఆగస్టు 12వ తేదీన ఆరతి ఉక్కడ ఆలయం వద్ద చోటుచేసుకుంది. ఆలయంలో దర్శనం ఆలస్యం కావడంతో ఎమ్మెల్యే కుమార్తెకు, డ్యూటీలో ఉన్న సబ్-ఇన్‌స్పెక్టర్ సవితా బి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే బి. సురేష్ గౌడ కుమార్తె, ఏసీపీ గౌతమ్ భార్య అయిన ఐశ్వర్య.. సబ్-ఇన్‌స్పెక్టర్‌ను దూషించి, తలపై కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

వైరల్ అయిన ఆ వీడియోలో, చిన్న వాగ్వాదం తర్వాత ఆ మహిళ పోలీస్ అధికారిని కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే ఆ పోలీస్ అధికారి కూడా ఆమెపై ఎదురుదాడి చేయడం, అక్కడే ఉన్న మరో పోలీస్ కానిస్టేబుల్, ఇతర వ్యక్తులు వారిని విడదీయడానికి ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. BNS యాక్ట్ తో పాటుగా మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. రాజకీయ ప్రభావాన్ని అడ్డం పెట్టుకుని ఇలా ప్రవర్తించడం సరికాదని, వెంటనే ఆమెను అరెస్టు చేయాలని పలువురు నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులే ఇలా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకుల కుమార్తె కావడంతోనే ఇప్పటివరకు అరెస్టు చేయలేదా అంటూ పలువురు నెటిజన్లు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.