Toxic Collections : యశ్‌ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic). కొత్త రికార్డులు సొంతం చేసుకుంటోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే అంచనాలను మించి సరికొత్త రికార్డుల వైపు పయనిస్తోంది. ఆగస్టు 21న ప్రారంభమైన బుకింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. దీంతో విడుదలకు ముందే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది

కాగా, ప్రస్తుతం ఉన్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం తొలి రోజు కోసం భారత్‌లో డైరెక్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.21.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 13,591 షోలకు గాను దాదాపు 5.55 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక హోల్డ్‌లో ఉంచిన సీట్లతో కలిపి చూస్తే ఈ మొత్తం ఏకంగా రూ.30.14 కోట్లు దాటాయని ట్రేడ్‌ వర్గాల అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా హోమ్ స్టేట్ కర్ణాటకలో ఈ సినిమా బుకింగ్స్ పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అక్కడ ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, టాక్సిక్‌ చిత్రం పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మేనియా కనిపిస్తోంది. హిందీ బెల్ట్‌లో ఇప్పటికే రూ. 7.35 కోట్లకు పైగా బుకింగ్స్ జరగగా, నార్త్ అమెరికా (యూఎస్) ప్రీమియర్ బుకింగ్స్ ద్వారా 1.63 లక్షల డాలర్ల (రూ.1.56కోట్లు) వసూళ్లు వచ్చినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. విదేశాల్లో ఈ సినిమా 260 లొకేషన్లలో, 709 ప్రాంతాల్లో రిలీజ్‌అవుతుంది. ఇక్కడ ముఖ్య విశేషమేమిటంటే యూఎస్‌లో కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్‌ బుకింగ్స్‌కే అధికంగా ఉన్నాయని తేలింది. రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్‌’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను టాక్సిక్‌ ఇప్పటికే అధిగమించింది. కాగా, రిలీజ్ నాటికి మరిన్ని మైలురాళ్లను దాటే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల కేటాయింపుల వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద స్ట్రైట్ తెలుగు, డ‌బ్బింగ్ చిత్రాలు ప్రదర్శితమవుతున్న వేళ, పాన్-ఇండియా స్థాయిలో రాబోతున్న భారీ బడ్జెట్ డబ్బింగ్ సినిమా ‘టాక్సిక్’ (Toxic) ఎంట్రీతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో, ఎగ్జిబిటర్లు ఈ సినిమాకు అత్యధిక సంఖ్యలో స్క్రీన్లను కేటాయించేందుకు పోటీ పడుతున్నారు. ఇటు టాలీవుడ్‌లో సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, అలాగే ర‌వితేజ న‌టించిన‌ ‘ఇరుముడి’ చిత్రాలు మంచి పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ‘టాక్సిక్’ లాంటి భారీ క్రేజ్ ఉన్న పాన్-ఇండియా చిత్రం ఎంట్రీ ఇస్తుండటంతో థియేటర్ల పోరు నైజాంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్లీ మొదలైంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.