కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పే కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం నెలకు లభిస్తున్న కనీస ప్రాథమిక వేతనం రూ. 18,000 నుంచి ఏకంగా రూ. 72,000 వరకు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ ఉద్యోగుల సమాఖ్య అయిన భారతీయ ప్రతిరక్షా మజ్దూర్ సంఘ్ ఈ సంచలనాత్మక సిఫార్సును 8వ వేతన సంఘం ముందు ఉంచినట్లు సమాచారం. ఒకవేళ ఈ డిమాండ్‌ను కనుక కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే కనీస వేతనంలో ఏకంగా 300 శాతం పెను మార్పు వస్తుంది.

ఈ అసాధారణమైన పెంపును ప్రతిపాదించడానికి BPMS మూడు ప్రధాన ప్రాతిపదికలను ఆధారంగా చేసుకుంది. దేశంలో తలసరి జాతీయ ఆదాయంలో నమోదవుతున్న అద్భుతమైన వృద్ధి, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగి కుటుంబ పరిమాణం పెరగడం, ప్రభుత్వ ఆర్థిక పరిమితులు అనే అంశాలను ఇందులో భాగం చేశారు. అయితే 2016-17లో రూ. 1,03,219గా ఉన్న తలసరి నికర జాతీయ ఆదాయం 2024-25 నాటికి రూ.1,92,774కు పెరిగింది. ప్రస్తుత బేసిక్ పే రూ.18,000కు 58 శాతం కరువు భత్యం (DA) కలిపితే రూ. 28,440 కాగా, దానికి ఈ 86.76 శాతం తలసరి ఆదాయ వృద్ధిని యాడ్ చేస్తే ప్రాథమిక సవరించిన కనీస వేతనం రూ.53,114కు చేరుతుందని తెలిపారు.

గతంలో 7వ వేతన సంఘం కనీస వేతనాన్ని లెక్కించడానికి ఒక కుటుంబంలో కేవలం ముగ్గురు సభ్యులను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఉద్యోగి తన భార్యాపిల్లలతో పాటు వయోవృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలను కూడా మోయాల్సి వస్తోందని సమాఖ్య తెలిపింది. అందువల్ల కుటుంబ నిర్మాణాన్ని 5 యూనిట్లుగా అంటే ఉద్యోగి-1, జీవిత భాగస్వామి-1, ఇద్దరు పిల్లలు-1.5, తల్లిదండ్రులు-1.5 మార్చాలని సూచించింది. ఈ 5 యూనిట్ల సమీకరణాన్ని రూ. 53,114కు వర్తింపజేస్తే సవరించిన మొత్తం రూ. 88,524గా వస్తుంది.

లెక్కల ప్రకారం వేతనం రూ. 88,524గా వచ్చినప్పటికీ ప్రభుత్వంపై ఒకేసారి భరించలేనంత ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్యం, విద్య, గృహ అవసరాల ఖర్చులను తట్టుకునేలా రూ. 72,000 అనేది ప్రభుత్వానికి, ఉద్యోగికి ఇద్దరికీ సరిగ్గా ఉండే సమతుల్య మొత్తం అని BPMS భావించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.