
Pakistan : పాకిస్థాన్ ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. దేశంలో ఎక్కడ చూసినా ఆర్థిక సంక్షోభం, అల్లర్లు కనిపిస్తున్నాయి. ప్రజలు తినడానికి తిండిలేక నానా ఇబ్బందులు పడుతుంటే.. సైన్యాధ్యక్షుడు మాత్రం తన కుర్చీని, అధికారాన్ని కాపాడుకోవడానికి దేశ రాజ్యాంగాన్నే మార్చే ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
పాకిస్థాన్‌లో మరోసారి యూనిఫామ్ వేసుకున్న అధికారుల ఆధిపత్యం పెరిగిపోతోంది. దేశం దివాలా తీసినా, పీఓకే నుంచి బలూచిస్తాన్ వరకు సైన్యంపై తిరుగుబాటు జరుగుతున్నా.. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు మాత్రం తన పదవి గురించే ఆలోచన ఉంది. పర్వేజ్ ముషారఫ్ మాదిరిగానే మునీర్ కూడా రాజ్యాంగాన్ని మారుస్తూ తన శక్తిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు.
ప్రస్తుత పార్లమెంటరీ విధానాన్ని మార్చి, అధ్యక్ష రకం పాలనను తీసుకొచ్చే ఆలోచనలో సైనిక వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలలో సైన్యానికి సమాన హక్కు లభిస్తుంది. అంతేకాకుండా కొత్త రాష్ట్రాలు, సరికొత్త పరిపాలనా మార్పులతో పాటు పదేళ్ల ఆర్థిక ప్రణాళికను అమలు చేయడానికి కూడా పావులు కదుపుతున్నారు.
దేశం ఈ స్థితికి చేరుకోవడానికి కారణం గతంలో సైన్యం ప్రోత్సహించిన రాజకీయ కుటుంబాలే అని ఇప్పుడు వారిపైనే నెపం నెడుతున్నారు. షరీఫ్, భుట్టో-జర్దారీ కుటుంబాలపై అవినీతి ఆరోపణలు మోపి, అసలు అధికారం మాత్రం పూర్తిగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతిలోకి తీసుకునేలా పావులు కదుపుతున్నారు.
మరోవైపు దేశంలో అంతర్గత కల్లోలాలు పెరిగిపోతుండటం, విదేశీ అప్పులు విపరీతంగా పెరిగిపోవడంతో అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ పరువు పోతోంది. ఇలాంటి సమయంలో వస్తున్న ఈ రాజకీయ మార్పులు ఆ దేశ భవిష్యత్తును మరింత ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. రాజ్యాంగంలో ఏవైనా పెద్ద మార్పులు వస్తే పాకిస్థాన్ రాజకీయ రూపురేఖలే పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.









