Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, పాకిస్థాన్ ప్రభుత్వం ఆయనపై పెడుతున్న హింస గురించి ఆయన సోదరి నియాజీ సంచలన విషయాలు వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని, అయితే ఆయన పడుతున్న నరకం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ఆమె తెలిపారు.

తాను ఇమ్రాన్ ఖాన్‌ను కలిశానని నియాజీ చెప్పారు. జైలులో ఆయనకు మానసికంగా, శారీరకంగా తీవ్రమైన హింస ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. భారతీయ మీడియాకు ఇమ్రాన్ ఖాన్ కుటుంబం ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని తెలిపారు. గత 10 నెలలుగా పాకిస్థాన్ ప్రభుత్వం ఈ దారుణాలకు పాల్పడుతోందని, ఆయన ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నప్పటికీ ఎవరూ ఆయనను కలవడానికి అనుమతించడం లేదని ఆమె వాపోయారు.

ఇమ్రాన్ ఖాన్‌ను అత్యంత దయనీయమైన పరిస్థితులలో ఉంచారని ఆయన సోదరి వెల్లడించారు. గతంలో నవాజ్ షరీఫ్ జైలులో ఉన్నప్పుడు అక్కడ ఏసీ వసతులు ఉన్నాయని, కానీ ఇమ్రాన్ ఖాన్‌ను ఎలాంటి సౌకర్యాలు లేని అతి చిన్నదైన డెత్ సెల్ లో బంధించారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆస్పత్రికి తరలించడానికి పాక్ ప్రభుత్వం రకరకాల సాకులు చెబుతోందని, వీరు అత్యంత క్రూరులని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ విషయమై డాక్టర్ అయిన ఇమ్రాన్ ఖాన్ మరో సోదరి ఉజ్మా ఖాన్ మాట్లాడుతూ.. తన ఆరోగ్యం బాగోలేదని, తన వద్ద పుస్తకాలు లేవని, ఎవరితోనూ మాట్లాడే అవకాశం కల్పించడం లేదని ఇమ్రాన్ ఖాన్ తనతో చెప్పారన్నారు. ఆయనకు కేవలం కంటి పరీక్ష మాత్రమే చేశారని, వైద్యం పట్ల తాము సంతృప్తిగా లేమని తెలిపారు. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంచడం కూడా ఒకరకమైన చిత్రహింసేనని, గత 10 నెలలుగా ఆయన ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఆమె ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందని ఆయన సోదరిల మాటల ద్వారా స్పష్టమవుతోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.