
Canada : అమెరికా-కెనడా దేశాల మధ్య వాణిజ్య చర్చలు పూర్తిగా ఆగిపోయాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించాలనుకున్న 50 శాతం దిగుమతి పన్నును పూర్తిగా అన్యాయమని ఖండిస్తూ చర్చలను నిలిపివేశారు. అమెరికా సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా వస్తువులపై 50 శాతం టారిఫ్లు విధించడానికి సిద్ధమైంది. గత వారం కుదిరిన ఒప్పందాల ప్రకారం చివరి నిమిషంలో అమెరికా కొత్త నిబంధనలు తెచ్చిందని, అవి అన్యాయంగా, ఆర్థికంగా భారంగా ఉన్నాయని, ఈ ఒప్పందం ఏమాత్రం నమ్మదగినది కాదని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. కెనడియన్ కార్మికులకు, వ్యాపారస్తులకు రాబోయే రోజుల్లో అదనపు మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు.
మరోవైపు, అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ మాట్లాడుతూ.. కెనడా చివరి నిమిషంలో కొన్ని కొత్త డిమాండ్లు తెచ్చిందని, గతంలో కుదిరిన ఒప్పందాన్ని మార్చాలని చూసిందని చెప్పారు. అమెరికా మార్కెట్లో కెనడాకు అత్యుత్తమ గుర్తింపు ఇస్తామని చెప్పినా, కెనడా వెనక్కి తగ్గిందని ఆయన తెలిపారు. అమెరికా-కెనడా దేశాల మధ్య ఏటా దాదాపు 880 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, సేవలు అమ్ముడవుతాయి. కెనడా ఎగుమతుల్లో దాదాపు 72 శాతం అమెరికాకే వెళ్తాయి. గతంలో ఈ రెండు దేశాలు ఎన్నో దశాబ్దాలుగా మంచి మిత్రదేశాలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అమెరికన్లతో కలిసి కెనడియన్ సైనికులు పోరాడారు. ఈ రెండు దేశాల మధ్య 5,525 మైళ్ల సరిహద్దు ఉంది. ప్రతిరోజూ దాదాపు 3,30,000 మంది, 2 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఈ సరిహద్దు దాటుతుంటాయి. దాదాపు 8,00,000 మంది కెనడియన్లు అమెరికాలో నివసిస్తున్నారు.









