
Rayadurg Lands Auction : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన రాయదుర్గం భూముల వేలానికి క్లియరెన్స్ వచ్చింది. TGIIC నిర్వహిస్తున్న వేలం ప్రక్రియను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయడంతో, వేలం కొనసాగించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఈ భూముల వేలం ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఏర్పడింది.
రాయదుర్గం లోని పాన్‌మక్తా భూముల వేలం విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. టీజీఐఐసీ నిర్వహిస్తున్న భూముల వేలంపై జోక్యం చేసుకునేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వేలం ప్రక్రియను సవాలు చేస్తూ జువ్వాడి ప్రణయ్ సింహారావు అనే వ్యక్తి దాఖలు చేసిన WP No.1028/2026 పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ మేరకు కొట్టివేసింది. ఏదైనా అభ్యంతరం ఉంటే హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వారికి సూచించింది ఈ ధర్మాసనంలో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ మోహన్ కూడా ఉన్నారు. దీంతో రాయదుర్గం పాన్‌మక్తా భూముల వేలం కొనసాగించేందుకు టీజీఐఐసీకి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
రాయదుర్గం పాన్‌మక్తా ప్రాంతంలో ఉన్న రెండు వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 11 ఎకరాల భూములున్నాయి. వీటిని విక్రయించడానికి టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో ఎకరానికి రూ.175 కోట్లను కనీస ధరగా నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, ఈ వేలాన్ని సవాలు చేస్తూ ప్రణయ్ సింహారావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, రక్షించాల్సిన భూములనే ఇప్పుడు వేలం వేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ కోర్టులో వాదించారు. అయితే పిటిషనర్ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
గతంలో సుప్రీం స్టే ఇచ్చిన కంచ గచ్చిబౌలి భూములకు, ప్రస్తుతం వేలం వేయనున్న భూములకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వాదించారు. అవి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని కోర్టుకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. టీజీఐఐసీ నోటిఫికేషన్‌లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అంతే కాదు తదుపరి పిటీషన్‌పై విచారణకు కూడా నిరాకరించింది. దీంతో భూముల వేలానికి మార్గం సుగమమైంది.
వేలంలో రికార్డు ధర
కాగా, సుప్రీం కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో పాన్‌మక్తాలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల భూమికి టీజీఐఐసీ శుక్రవారం వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడుపోవడం గమనార్హం. ఎంఎస్‌ఎన్ రియాలిటీ అనే సంస్థ ఈ అధిక ధర చెల్లించి ఈ భూమిని తన సొంతం చేసుకుంది. మొత్తం 5.25 ఎకరాలనూ ఒకే సంస్థ కొనుగోలు చేసింది. ఇదే సర్వే నంబర్‌లో మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరా రూ.237 కోట్లు పలకగా ఈసారి మరింత ధర పలకడం విశేషం.
కాగా, వేలంలో కనీస ధర రూ.175 కోట్లు, డిపాజిట్ రూ.10కోట్లుగా టీజీఐఐసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. బిడ్డర్లు డిపాజిట్ చెల్లించి పెద్ద ఎత్తున వేలంలో పాల్గొన్నారు. ఖరీదైన భూమి కావడంతో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీపడి బిడ్డింగ్ దాఖలు చేశాయి. చివరికి ఎంఎస్‌ఎన్ సంస్థ అధిక ధర చెల్లించి ఈ భూమిని సొంతం చేసుకుంది.









