Suits on Meta US
Suits on Meta US

మీ పిల్లాడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతసేపు ఉంటున్నాడు? ఒక గంటా… రెండు గంటలా… లేక తెలియకుండానే గంటల తరబడి? ఇప్పుడు ఇదే విషయం అమెరికాలో ఏకంగా కోర్టు వరకు వెళ్లింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటాపై 29 అమెరికా రాష్ట్రాల కూటమి భారీ కేసు వేసింది. ఆరోపణ ఏంటంటే… “పిల్లలను, టీనేజర్స్‌ను ఎక్కువసేపు సోషల్ మీడియాలోనే ఉంచేందుకు మెటా కావాలనే తన ప్లాట్‌ఫార్మ్స్‌ను డిజైన్ చేసింది” అంతేకాదు… పిల్లల బలహీనతలను కంపెనీకి ముందే తెలుసని… వాటినే ఉపయోగించుకుని ఎంగేజ్‌మెంట్ పెంచిందని ప్రొసిక్యూషన్ ఆరోపిస్తోంది. ఇది సాధారణ న్యాయపరమైన దావా కాదు. ఎందుకంటే ఈ కేసు తీర్పు సోషల్ మీడియా కంపెనీల భవిష్యత్తుపైనే ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే కొందరు ఎక్స్‌పర్ట్స్ దీన్ని… “సోషల్ మీడియా ఇండస్ట్రీకి బిగ్ టొబాకో మూమెంట్” అంటున్నారు. అసలు మెటాపై ఆరోపణలు ఏంటి? 29 రాష్ట్రాలు ఎందుకు రంగంలోకి దిగాయి? మెటా ఏం చెబుతోంది? మరి ఏకంగా 200 బిలియన్ డాలర్ల జరిమానా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? వివరంగా చూద్దాం.

పిల్లలను కావాలనే బానిసలుగా మార్చారా? ఈ కేసులో విచారణ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇదే. మెటాకి తన ప్లాట్ ఫార్మ్స్‌లో యూజర్స్ ఎంత ఎక్కువసేపు ఉంటే… అంత ఎక్కువ ఎంగేజ్‌మెంట్, డేటా, అడ్వర్‌టైజింగ్ వాల్యూ వస్తుంది. అందుకే… యూజర్‌ను మాక్సిమమ్ టైమ్ ఆన్‌లైన్‌లో ఉంచేలా ఫీచర్స్‌ను ఉద్దేశపూర్వకంగా అభివృద్ధి చేసిందని రాష్ట్రాల కూటమి ఆరోపిస్తోంది. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్స్ విషయంలో ఇది మరింత ప్రమాదకరమని చెబుతున్నారు. ఎందుకంటే చిన్న వయసులో… సోషల్ అప్రువల్ కోసం ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ ఇంకా పూర్తిగా డెవలప్ అయి ఉండదు. లైక్స్, కామెంట్స్, నోటిఫికేషన్స్ వంటి సోషల్ రివార్డ్స్‌కు పిల్లలు త్వరగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ మెటాకి తెలుసని ప్రొసిక్యూషన్ వాదిస్తోంది. అంటే… “పిల్లల సైకాలజీ తెలుసు… అదే సైకాలజీని ప్లాట్‌ఫారమ్ ఎంగేజ్‌మెంట్ కోసం వాడుకున్నారా?” అదే ఈ కేసులో కీలక ప్రశ్న.

విచారణ సందర్భంగా కాలిఫోర్నియా తరఫు ప్రభుత్వ న్యాయవాది మేగన్ ఓ’నీల్ తీవ్ర ఆరోపణలు చేశారు. మెటా పిల్లల మెదడు పనిచేసే విధానం గురించి రీసెర్చ్ చేసిందని… వాళ్లను ప్లాట్ ఫార్మ్‌లలో ఎక్కువసేపు ఉంచేందుకు Instagramను ఎలా మార్చాలనే అంశంపై కూడా చర్చించిందని ఆమె కోర్టులో పేర్కొన్నారు. ఇక్కడ ప్రొసిక్యూషన్ ప్రస్తావించిన ఒక అంశం మరింత సంచలనంగా మారింది. “Young people are the best” అనే భావనతో మెటా చేసిన అంతర్గత పరిశోధనను కోర్టులో సాక్ష్యంగా చూపించబోతున్నామని ఆమె తెలిపారు. అంతేకాదు… “మెటాకి పిల్లలు కేవలం యూజర్స్ కాదు… బిజినెస్ మోడల్‌లో భాగం” అనే వాదనను ప్రొసిక్యూషన్ ముందుకు తీసుకొచ్చింది.

Facebook, Instagram వంటి ప్లాట్ ఫార్మ్స్‌లో సాధారణంగా 13 ఏళ్లలోపు పిల్లలకు అకౌంట్ రిస్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ… 13 ఏళ్లలోపు పిల్లలు ప్లాట్ ఫార్మ్‌ను ఉపయోగిస్తున్న విషయం మెటాకి తెలుసని ప్రొసిక్యూషన్ ఆరోపిస్తోంది. అయినా వారిని పూర్తిగా రిమూవ్ చేయడానికి కంపెనీ తగిన చర్యలు తీసుకోలేదని వాదిస్తోంది. ఇక్కడ మరో ఉదాహరణను కూడా ప్రొసిక్యూషన్ ప్రస్తావించింది. ఒక యూజర్ 13 ఏళ్లలోపు ఉన్నట్లు గుర్తిస్తే ఫేస్‌బుక్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేసినా.. దానికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ మాత్రం యాక్టివ్‌గా ఉండే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. అంటే… “రూల్స్ ఉన్నాయి… కానీ వాటిని అమలు చేయడంలో కంపెనీలు విఫలమైందా?” అనే ప్రశ్న ఇప్పుడు కోర్టులో ఉంది.

Also Read : ఏఐ రోబోలతో చైనా మాస్టర్ ప్లాన్

ఇక మెటా మాత్రం ఈ ఆరోపణలను అంగీకరించడం లేదు. కంపెనీ తరఫు న్యాయవాది పాల్ ష్మిత్… కొంతమంది యూజర్స్‌కు ప్లాట్ ఫార్మ్స్‌పై నెగటివ్ ఎక్స్‌పీరియన్సెస్ ఎదురయ్యే అవకాశం ఉందని అంగీకరించినా… వారిని ప్రొటెక్ట్ చేయడానికి మెటా అనేక సేఫ్టీ టూల్స్ అభివృద్ధి చేసిందని చెప్పారు. అంతేకాదు… పేరెంట్స్, ఎక్స్‌పర్ట్స్, చట్ట అమలు సంస్థలతో కలిసి పిల్లల సేఫ్టీ కోసం పనిచేస్తున్నామని మెటా చెబుతోంది. అంటే…
ప్రొసిక్యూషన్: “పిల్లల బలహీనతలను వాడుకున్నారు.”
మెటా: “సేఫ్టీ కోసం టూల్స్ పెట్టాం.”
ఇప్పుడు ఈ రెండు వాదనల్లో ఏది నిజమో కోర్టు నిర్ణయించాలి.

ఈ కేసులో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్.. మెటా మాజీ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఆర్టురో బెజార్ ఇచ్చిన సాక్ష్యం. ఆయన ఫేస్‌బుక్ ప్రారంభ సంవత్సరాల గురించి కోర్టులో కీలక విషయాలు చెప్పారు. ఆ సమయంలో… “ఫీచర్స్‌ను వీలైనంత త్వరగా యూజర్స్‌కి అందించడమే ప్రేయారిటీ” అని చెప్పారు. దీంతో సేఫ్టీ, ప్రొటెక్షన్ లాంటి అంశాలు కొన్ని సందర్భాల్లో తరువాతి ప్రేయారిటీగా మారాయని ఆయన వాదించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యూజర్ సేఫ్టీపై తాను గతంలో ఆందోళనలు వ్యక్తం చేశానని కూడా ఆయన సాక్ష్యంలో వివరించారు. మెటా ఆయన సాక్ష్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ… కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఈ సాక్ష్యం కూడా కేసులో కీలకంగా మారింది.

కేసు కోర్టులో జరుగుతుంటే… కోర్టు బయట కూడా తల్లిదండ్రులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ముఖ్యంగా సోషల్ మీడియా అతి వినియోగం కారణంగా తమ పిల్లలు తీవ్ర మానసిక సమస్యలను ఎదుర్కొన్నారని ఆరోపిస్తున్న కుటుంబాలు కూడా నిరసనలో పాల్గొన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు… “పెద్ద సాంకేతిక సంస్థలకి పవర్ ఉంది.. కానీ ఆ పవర్‌కి జవాబుదారీతనం కూడా ఉండాలి” అంటూ నిరసన వ్యక్తం చేశారు. అంటే ఈ కేసు కేవలం న్యాయపోరాటం కాదు… తల్లిదండ్రులు వర్సెస్ బిగ్ టెక్ అనే పెద్ద డిబెట్‌గా కూడా మారుతోంది.

Also Read : అప్పుల్లో అమెరికా సరికొత్త రికార్డు.. మరి ఇండియా పరిస్థితి ఏంటి?

ఈ న్యాయపరమైన దావాను మొదట 2023లో ప్రారంభించారు. ఇప్పుడు 29 రాష్ట్రాల కూటమి మెటాపై పలు తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనవి… మెటా తన యాప్స్ వల్ల పిల్లలకు కలిగే రిస్క్స్‌ను తక్కువ చేసి చూపిందని ఆరోపణ. యూజర్స్ మళ్లీ మళ్లీ ప్లాట్‌ఫామ్స్‌కు వచ్చేలా ఎంగేజ్‌మెంట్ ఫీచర్లు రూపొందించిందని ఆరోపణ. 13 ఏళ్లలోపు పిల్లల డేటాను తగిన తల్లిదండ్రుల సమ్మతి లేకుండా సేకరించిదని ఆరోపణ. స్క్రీన్‌ టైమ్ కంట్రోల్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్‌ను సులభంగా బైపాస్ చేసే పరిస్థితులు ఉన్నాయని కూడా వాదిస్తున్నారు. అందుకే… “మెటా ప్లాట్ ఫార్మ్స్‌లలో ప్రాథమిక మార్పులు చేయాలి అంటూ స్టేట్స్ డిమాండ్ చేస్తున్నాయి.

ఇక ఈ కేసులో అత్యంత సంచలన అంశం… $200 బిలియన్ల జరిమానా డిమాండ్. అవును… 200 బిలియన్ డాలర్లు! అంతేకాదు… పిల్లల కోసం స్క్రీన్-టైమ్ పరిమితులు… మరింత బలమైన భద్రతా చర్యలు… మరింత కఠినమైన డేటా రక్షణ… ఇలాంటి మార్పులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకురావాలని స్టేట్స్ కోరుతున్నాయి. అంటే కేవలం డబ్బు కట్టించడమే కాదు… “నీ బిజినెస్ మోడల్‌నే మార్చు!” అనే స్థాయిలో ప్రెజర్ పెడుతున్నారు.

ఇక్కడే ఈ కేసు చారిత్రక ప్రాముఖ్యత వస్తుంది. 1990లలో అమెరికాలో పొగాకు కంపెనీలపై కూడా ఇలాంటి భారీ న్యాయ పోరాటం జరిగింది. పొగాకు కంపెనీలు ధూమపానం వల్ల వచ్చే ఆరోగ్యపరమైన ప్రమాదాల గురించి ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వలేదని రాష్ట్రాలు ఆరోపించాయి. ఆ కేసులు చివరకు 1998లో చారిత్రక సెటిల్‌మెంట్‌కు దారితీశాయి. ఆ సెటిల్‌మెంట్‌లో పొగాకు కంపెనీలు భారీ మొత్తాలు చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు… “సోషల్ మీడియా కంపెనీలు కూడా తమ ప్రొడెక్ట్స్ వల్ల వచ్చే రిస్క్స్‌ను ముందే తెలుసుకున్నాయా?” అనే ప్రశ్నతో మెటాపై కేసు నడుస్తోంది. అందుకే న్యాయ నిపుణులలో కొందరు దీన్ని… “Big Tobacco Moment for Social Media” అని పోలుస్తున్నారు.

మొత్తానికి… ఇది కేవలం మెటాపై ఒక న్యాయపరమైన దావా కాదు. పిల్లల మెంటల్ హెల్త్… సోషల్ మీడియా వ్యసనం… డేటా ప్రైవసీ.. బిగ్ టెక్ జవాబుదారీతనం… ఈ నాలుగు అంశాలపై జరుగుతున్న పెద్ద న్యాయపోరాటం. ఒకవైపు… “మెటా పిల్లలను ప్రొటెక్ట్ చేయలేదు” అంటున్న 29 రాష్ట్రాలు. మరోవైపు… “మేము ఇప్పటికే ఎన్నో సేఫ్టీ టూల్స్ తీసుకొచ్చాం” అంటున్న మెటా. ఇప్పుడు అసలు పరీక్ష కోర్టుదే. ఈ కేసులో తీర్పు మెటాకు మాత్రమే కాదు… ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్ టాక్ లాంటి మొత్తం సోషల్ మీడియా ఇండస్ట్రీకి కొత్త రూల్స్‌కు దారితీస్తుందా? అదే ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా చూస్తున్న విషయం. ఎందుకంటే… పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండొచ్చు… కానీ వారి ఫ్యూచర్ మాత్రం ఆల్గారిథమ్ చేతిలో ఉండకూడదు.