
New York : అమెరికాలో 9/11 కంటే దారుణమైన ఉగ్రదాడికి కుట్ర పన్నిన 35 ఏళ్ల మహిళ ఉదంతం కలకలం రేపింది. న్యూయార్క్ స్టేట్ క్యాపిటల్ భవనాలను బాంబులతో పేల్చివేసేందుకు ప్లాన్ చేసిన సదరు మహిళను ఎఫ్బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. న్యూయార్క్ రాజధాని అల్బానీలోని స్టేట్ క్యాపిటల్ భవనమే లక్ష్యంగా ఈ దాడికి కుట్ర జరిగింది. అక్కడి అసెంబ్లీ, సెనెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రజాప్రతినిధులను చంపేసి, కీలకమైన ప్రభుత్వ పత్రాలను, భవనాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా ప్రణాళిక రచించారు.
Also Read : ఏఐ రోబోలతో చైనా మాస్టర్ ప్లాన్
అరెస్ట్ అయిన 35 ఏళ్ల జెస్సికా బోవీ, ఇస్లాం మతాన్ని స్వీకరించి నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ వైపు ఆకర్షితురాలైంది. సోషల్ మీడియాలో 9/11 దాడుల సూత్రధారులకు మద్దతుగా, అమెరికా వ్యతిరేక పోస్టులు పెడుతుండేది. ఎఫ్బీఐ ఇన్ఫార్మర్కు మెసేజ్లు పంపుతూ బాంబులు తయారీ, పేలుడు పదార్థాల గురించి ఆరా తీసింది.
సెక్యూరిటీని తప్పించుకుని భవనంలోకి వెళ్లేందుకు డోర్డాష్ ఫుడ్ డెలివరీ డ్రైవర్లా నటించాలని ప్లాన్ చేసింది. స్థానిక హోమ్ డిపో నుంచి బుర్ఖా వేసుకుని బాంబు తయారీకి కావలసిన సీకులు, మేకులు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుండగా సిసిటివి కెమెరాల్లో చిక్కింది.
క్యాపిటల్ భవనం దగ్గర పిక్నిక్ నెపంతో వెళ్లి అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జెస్సికా, దాడి ముగిశాక సిరియాకు పారిపోవాలని భావించింది. ఆ తర్వాత తిరిగి వచ్చి టైమ్స్ స్క్వేర్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలను టార్గెట్ చేయాలని ప్లాన్ చేసుకుంది. అయితే, పక్కా సమాచారంతో ఎఫ్బీఐ అధికారులు ఆగస్టు 19న ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆమె వద్ద నుంచి బాంబు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read : ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమం: ఆసుపత్రికి తరలింపు!









