Telangana : మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌తో పాటు ఆయన అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ బోడుప్పల్ ప్రాంతానికి చెందిన గొంగిడి హరికృష్ణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. గత నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు సుమంత్ నుంచి అత్యవసరంగా కలవాలంటూ ఫోన్ కాల్ చేశారు. తాను ఊరి నుంచి అప్పుడే వచ్చానని, మరుసటి రోజు కలుస్తానని హరికృష్ణ చెప్పినప్పటికీ సుమంత్ వినలేదు. ఆ తర్వాత హరికృష్ణ స్నేహితుడు రాము కూడా ఫోన్ చేసి రమ్మనడంతో, రాత్రి 9.45 గంటల సమయంలో తన స్నేహితుడు కిరణ్‌ను తీసుకుని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గరున్న రాము ఆఫీస్‌కు వెళ్లారు.

Also Read : నా వ్యాఖ్యలతో కొండా సురేఖకు సంబంధం లేదు… కొండా సుస్మిత

అక్కడకు వెళ్లగానే, తన పేరు చెప్పుకుని బయట రూ. 10 కోట్లు వసూలు చేస్తున్నావంటూ సుమంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అలాంటి పనులు చేయలేదని హరికృష్ణ ఎంత చెప్పినా వినకుండా, దుర్భాషలాడుతూ ఇనుప రాడ్డుతో కాళ్లు, చేతులపై దారుణంగా కొట్టారు. అంతేకాకుండా వీడిని కొట్టి చంపేయండి అని చెబుతూ తన అనుచరులైన ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాములతో కలిసి దాడి చేయించారు. ఈ విషయం బయటకు చెబితే ప్రాణాలు తీస్తామని కూడా బెదిరించారు.

ఈ దారుణ దాడిలో హరికృష్ణ ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడమే కాకుండా తీవ్ర రక్తస్రావమై, రక్తపు వాంతులు అయ్యాయి. సమాచారం అందుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయనను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా, చికిత్స చేయించుకుని వస్తానని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్లారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందుగా గాంధీ ఆసుపత్రి, ఆపై చెంగిచర్లలోని ఆసుపత్రిలో చికిత్స పొంది సిమెంట్ పట్టీ వేయించుకున్నారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో ఆగస్టు 10న ఉప్పల్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చేతికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

నిందితుల నుంచి ప్రాణహాని ఉందనే భయంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం వల్ల ఫిర్యాదు చేయడం ఆలస్యమైందని బాధితుడు తెలిపారు. కోలుకున్న తర్వాత ఆయన మేడిపల్లి పోలీసులను ఆశ్రయించగా, వారు హత్యాయత్నం (బిఎన్ఎస్ సెక్షన్ 109) కింద జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, సంఘటన జరిగిన ప్రాంతమైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.

Also Read : కాంగ్రెస్‌ హైకమాండ్ సీరియస్.. సురేఖ, చిన్నారెడ్దికి నోటీసులు.. జక్కిడి సస్పెండ్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.