
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశంలోని ఎన్నికల వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఆయన భారత ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపిస్తూ, అమెరికాలో ఓటర్ల నమోదు నియమాలను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో అర్హులైన పౌరులు మాత్రమే ఓటు వేసేలా చూడటానికి, ఓటర్ల గుర్తింపు ప్రక్రియను బలపరచడానికి ఆయన సేవ్ అమెరికా యాక్ట్ కింద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ తరచూ ఆరోపిస్తుంటారు, అందుకే ఈ వ్యవస్థలో మార్పులు తేవాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు.
భారత్‌లోని ఎన్నికల, ఓటింగ్ వ్యవస్థలతో ప్రభావితుడైన డొనాల్డ్ ట్రంప్.. ఇక్కడ అమలు చేసే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరహా ప్రక్రియపై పనిచేయడం ప్రారంభించారు. దీనిపై అమెరికాలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతుండగా, ఓటర్ల రికార్డులు, పౌరసత్వంపై అక్కడ కూడా భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టనున్నట్లు ఆయన సూచించారు. 2020 ఎన్నికల్లో నమోదైన ఓటర్ల వివరాలను అమెరికా సెన్సస్ బ్యూరో ద్వారా పౌరసత్వ రికార్డులతో సరిపోల్చి చూస్తున్నామని ట్రంప్ ప్రకటించారు.
ఈ ప్రక్రియ పూర్తిగా భారత్‌లో జరిగే SIR లాగా లేకపోయినప్పటికీ, ఓటర్ల జాబితా నుంచి విదేశీయులను లేదా పౌరసత్వం లేని వారిని గుర్తించడం, ఎన్నికల అర్హతలను పరిశీలించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే పరిశీలించిన 12.8 కోట్ల ఓటర్ల రికార్డుల్లో 24 వేల మందికి పైగా అమెరికా పౌరులు కానివారు ఉన్నారని, వారంతా అక్రమ ఓటర్లేనని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. త్వరలోనే మరో 3.2 కోట్ల రికార్డులను కూడా పరిశీలిస్తామని, అక్రమ ఓటర్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఆధారాలను చూపిస్తూనే సేవ్ అమెరికా యాక్ట్ చట్టాన్ని త్వరగా ఆమోదించాలని ఆయన మళ్లీ ఒత్తిడి తెస్తున్నారు.
ఈ పరిశీలనల ద్వారా 2020 ఎన్నికలకు సంబంధించి తాను చేసిన ఆరోపణలు నిజమేనని ట్రంప్ చెబుతున్నప్పటికీ, దీనిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. బయటపడిన ఈ డేటాను మాత్రమే ఆధారంగా చేసుకుని 2020 నాటి ఫలితాలు తప్పు అని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే 12.8 కోట్ల ఓటర్లలో 24 వేలు అనేది చాలా చిన్న సంఖ్య అని, పైగా వారు ఎవరికి ఓటు వేశారనేది కూడా స్పష్టంగా తెలియదని నివేదికలు చెబుతున్నాయి. 2020 ఎన్నికల్లో జో బైడెన్.. ట్రంప్ కంటే 70 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.









