
Bihar : బీహార్‌లోని నలంద జిల్లా పరసీ మిడిల్ స్కూల్లో ఘోరం జరిగింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న దాదాపు 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కూరలో ఉప్పు సరిపోలేదని పిల్లలు అడగ్గా, నిర్లక్ష్యంతో ఉప్పుకు బదులుగా డిటర్జెంట్ పౌడర్ కలిపి వడ్డించడమే దీనికి కారణమని తెలిసింది. భోజనం తిన్న వెంటనే పిల్లలకు కడుపునొప్పి, వాంతులు ప్రారంభం కావడంతో వారిని వెంటనే బీహార్ షరీఫ్ మోడల్ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు.
పాఠశాల ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలకు మధ్యాహ్న భోజనాన్ని మరొక స్కూల్ నుంచి సరఫరా చేశారు. పిల్లలకు వడ్డించిన సోయాబీన్ కూరలో ఉప్పు తక్కువగా ఉండటంతో, విద్యార్థులు ఉప్పు కావాలని అడిగారు. దాంతో అక్కడి సిబ్బంది పొరపాటున ఉప్పు అనుకుని డిటర్జెంట్ పౌడర్‌ను తెచ్చి కూరలో కలిపి పిల్లలకు వడ్డించారు. అది తెలియని విద్యార్థులు ఆ భోజనం తిన్నారు. తిన్న కాసేపటికే అందరికీ ఒకరి తర్వాత ఒకరికి కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో పాఠశాల యజమాన్యం వెంటనే వాహనాలు ఏర్పాటు చేసి పిల్లలను ఆసుపత్రికి తరలించింది.
ప్రస్తుతం ఆసుపత్రిలో నలంద సివిల్ సర్జన్ డాక్టర్ జై ప్రకాష్ సింగ్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం పిల్లలకు చికిత్స అందిస్తోంది. పిల్లలందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని, ఎవరూ ప్రమాదకర పరిస్థితిలో లేరని, నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని సివిల్ సర్జన్ తెలిపారు.
విషయం తెలుసుకున్న మంత్రి శ్రవణ్ కుమార్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి పిల్లలకు సరైన మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాఠశాలల్లో పిల్లలకు వంట వడ్డించే సమయంలో తీవ్ర జాగ్రత్తలు వహించాలని, ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆహార పదార్థాలు ఉంచే చోట డిటర్జెంట్ పౌడర్ ఎందుకు ఉంచారు? అది ఉప్పుగా ఎలా పొరబడ్డారు? అనే కోణంలో అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.









