Assam :  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను హత్య చేస్తానంటూ సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగిన వ్యక్తిని అస్సాం పోలీసులు మోరిగావ్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు ఆయన తండ్రి, సోదరుడు సహా మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌహతిలోని ఖానాపారాలో సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ లైవ్ కామెంట్ సెక్షన్‌లో అబ్దుల్ ముతా అనే వ్యక్తి సీఎంను రూ. 1 కోటి ఇస్తే చంపేస్తానని, డబ్బులు ఇచ్చేవారు తనను సంప్రదించాలని బెదిరింపు కామెంట్ పెట్టాడు.

ఆ కామెంట్‌లో కేవలం సీఎంకు బెదిరింపు మాత్రమే కాకుండా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్‌కు మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు కూడా పొందుపరిచారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన భురాగావ్ పోలీసులు, ఆ సోషల్ మీడియా ఖాతా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ కామెంట్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ వృత్తిరీత్యా దర్జీ అయిన అబ్దుల్ ముతాలేబ్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించి, రాత్రికి రాత్రే అతనిని కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ బెదిరింపు కామెంట్ ముతాలేబ్ స్వయంగా పెట్టాడా లేదా అతని ఖాతాను వేరొకరు దుర్వినియోగం చేశారా అనే కోణంలో పోలీసులు డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో విచారణ కోసం ముతాలేబ్ తండ్రి, సోదరుడితో పాటు మరొకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు.

ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతున్న సమయంలోనే ఈ బెదిరింపు కామెంట్ రావడం అక్కడ తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఘటనపై అస్సాం పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.