
NHAI : జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినపుడు అంబులెన్స్‌కు కాల్ చేయడం సాధారణం. అయితే కొన్ని సార్లు అంబులెన్స్‌లు సరైన సమయానికి రాకపోవడం మూలంగా బాధితులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) నూతన పాలసీ గైడ్‌లైన్స్‌ను తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తులు కాల్ చేస్తే అంబులెన్స్‌లు ప్రమాదం జరిగిన ప్రాంతానికి 10 నిమిషాల్లోపే చేరుకోవాలి. అంటే టికెట్ అంగీకరించిన సమయం నుంచి గంటలోపే బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. ఒకవేల వీటిలో ఏది చేయకపోయినా రూ.10 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఎన్హెచ్ఏఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం 1033కి కాల్ చేస్తే ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న అంబులెన్సులకు ఎమర్జెన్సీ అలర్ట్ వెళ్తుంది. దానిని వెంటనే ఆ అంబులెన్స్ అంగీకరించాలి. కాదని తిరస్కరిస్తే అంతేమొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంగీకరించిన క్షణం నుంచి 10 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాల్సిందే. లేకుంటే జరిమానా కట్టక తప్పదు. ఒకవేళ వెళ్లాల్సిన ప్రాంతం 10 కి.మీ.కు మించి ఉంటే జీపీఎస్ రికార్డులను అనుసరించి దామాషా ప్రకారం సమయాన్ని లెక్కిస్తారు. టికెట్ అంగీకరించాక గంటలోపు బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లా్ల్సి ఉంటుంది. అలాకాదని ఆలస్యం చేసినా పదివేల రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సిందే.
కాగా జాతీయ రహదారులకు సంబంధించి దేశవ్యాప్తంగా 3000 అంబులెన్సులు అందుబాటులోఉన్నాయి. ఆ అంబులెన్సుల్లో అత్యవసర వైద్య పరికరాలు, మందులు, సిబ్బంది ఉండాలి. వాటిలో ఏవీ లేకపోయినా రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎన్హెచ్ఏఐ కేర్ సిస్టమ్ సమర్థంగా పనిచేసేందుకు వీలుగా అంబులెన్స్‌లన్నింటికీ ఏఐఎస్-140 ప్రామాణికానికి అనువైన జీపీఎస్ పరికరం అమర్చి ఉంటుంది. ప్రతి వాహనానికీ డెడికేటెడ్ ఆండ్రాయిడ్ మొబైల్, ఐఓటీతో కూడిన సిమ్ సౌకర్యం కల్పించినట్లు రహదారుల సంస్థ తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు సహాయక చర్యలు ఆలస్యమవుతున్న విషయాన్ని సుప్రీం కోర్టు రోడ్డు భద్రతా కమిటీ, కాగ్ నిర్వహించిన ఆడిట్ లో వెల్లడైంది. అందుకే సవరించిన నూతన పాలసీ నిబంధనలను అమలు చేయాలని ప్రాజెక్టు డైరెక్టర్లకు, ప్రాంతీయ అధికారులకు ఎన్హెచ్ఏఐ ఆదేశించింది. మరో వైపు ఇక నుంచి డంపర్లు, టిప్పర్లు పై భాగంలో కప్పును కలిగి ఉండాలి. లేదంటే వారికి కూడా జరిమానా తప్పనిసరి అని స్పష్టం చేసింది.









