Shakeela :  మలయాళం మాజీ అడల్ట్ స్టార్ షకీలా ఆసుపత్రి పాలైంది. ఇటీవల ఆమె మెడ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఫోన్ వాడకానికి తీవ్రంగా బానిస కావడం వల్లే తాను సుమారు రూ. 3 లక్షలు ఖర్చు పెట్టి ఈ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆస్పత్రికి సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేసి, తన సోషల్ మీడియా ఫాలోవర్లతో పంచుకున్నారు. ఆ వీడియోలో షకీలా ఆస్పత్రి నుంచి డిస్ఛార్జ్ అయి తిరిగి ఇంటికి వచ్చేవరకు అన్ని వివరించారు.

తనకు ఈ గాయం ఎలా అయిందో వివరిస్తూ షకీలా పలు విషయాలను పంచుకున్నారు. “నేను మంచం మీద ఒక పక్కకు ఒరిగి పడుకుని వరుసగా నాలుగు గంటల పాటు ఫోన్‌లో గేమ్‌లు ఆడుతుండేదాన్ని. కేవలం టీ లేదా కాఫీ తాగడానికి మాత్రమే లేచేదాన్ని. టీ తాగాక మళ్లీ వచ్చి అదే గేమ్ ఆడేదాన్ని. ఆ తర్వాత యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో గంటల తరబడి రీల్స్ చూస్తూ గడిపేదాన్ని. సరిగ్గా కూర్చోకపోవడం, తప్పుడు భంగిమలో పడుకుని పరిమితికి మించి ఫోన్ వాడటం వల్ల నా మెడలోని ప్రధాన నరాలపై తీవ్ర ప్రభావం పడింది. చివరికి ఆ అలవాటే నన్ను ఆపరేషన్ టేబుల్ దాకా తీసుకెళ్లింది” అని ఆమె తన వీడియోలో చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆమె అందరికీ ఒక రిక్వెస్ట్ చేశారు. చిన్న పిల్లలకు ఫోన్లు ఇవ్వవద్దని, అలాగే తన వీడియోలతో సహా ఏ వీడియోలనూ ఎక్కువ సేపు చూడవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఆమె చెబుతూ.. ఫోన్‌ను కేవలం అత్యవసరమైన పనుల కోసమే వాడండి. అనవసరమైన వీడియోలు చూడకండి. చివరికి నా వీడియోలు కూడా చూడకండి. ఉపయోగపడే విషయాలను మాత్రమే చూడండి. లేకపోతే రూ. 3 లక్షల డబ్బు పోవడమే కాకుండా భరించలేని తీవ్రమైన నరకయాతన అనుభవించాల్సి వస్తుంది” అని షకీలా వివరించారు.

బి-గ్రేడ్ సినిమాల్లో శృంగార పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు షకీలా. సిల్క్ స్మిత తర్వాత దక్షిణాదిలో అందరి దృష్టిని ఆకర్షించిన నటి షకీలానే కావడం విశేషం. ఆమె నటించిన ప్రముఖ చిత్రాల్లో కిన్నార తుంబికల్, తాళ్వార, ప్లేగర్ల్స్, మోహనయాసంగళ్ వంటి సినిమాలు ఉన్నాయి. 2020లో ఆమె జీవితకథ ఆధారంగా షకీలా పేరుతో ఓ బయోపిక్ సినిమా కూడా విడుదలైంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.