
మధ్యప్రాచ్యంలో ముదిరిన యుద్ధ వాతావరణం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఓవైపు వేగంగా తరిగిపోతున్న సైనిక ఆయుధ నిల్వలు, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న చమురు ధరలు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. దీనికి తోడు రాబోయే నవంబరులో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనుండటంతో.. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందని ట్రంప్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. పశ్చిమాసియాలో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ పోరాటం వల్ల అమెరికాకు ఆశించిన ప్రయోజనం దక్కకపోగా నష్టమే ఎక్కువ జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇరాన్‌తో యుద్ధాన్ని త్వరితగతిన ముగించాలని అగ్రరాజ్యం భావిస్తోంది.
Also Read : హర్మూజ్‌లో మరోసారి ఉద్రిక్తత… ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి..
ఈ క్రమంలోనే ఇప్పటివరకు అత్యంత కీలకమైన అణు ఒప్పందం షరతును పక్కనబెట్టి అయినా ఇరాన్‌తో ఒప్పందానికి రావడానికి ట్రంప్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రారంభం నుంచి ఇరాన్ అణు కార్యక్రమాలను పూర్తిగా కట్టడి చేయాలనే ప్రధాన డిమాండ్‌తో అమెరికా ఒత్తిడి తెచ్చినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ షరతు లేకుండానే శాంతి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ కనుక ఎలాంటి షరతులు లేకుండా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని నౌకల రాకపోకల కోసం పూర్తిగా తెరిస్తే అణు డీల్ లేకపోయినా యుద్ధాన్ని ఆపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ మాత్రం ఈ శాంతి ఒప్పందానికి కఠినమైన డిమాండ్లను తెరపైకి తెచ్చింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తమపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు దిగ్బంధనాలను వెంటనే ఎత్తివేయాలని తెలిపింది. పశ్చిమాసియా ప్రాంతం నుంచి అమెరికా సైనిక దళాలు పూర్తిగా వైదొలగాలని టెహ్రాన్ తేల్చి చెప్పింది. యుద్ధాన్ని శాశ్వతంగా నిలిపివేసేవరకు హర్మూజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఇటీవల జరిగిన చర్చలు కూడా ఇదే కారణంతో కొలిక్కి రాలేదు.
ఇదే సమయంలో ఇరాన్ సైన్యం కూడా అమెరికాకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ అమెరికా దళాలు తమ భూభాగంలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ బ్రిగేడియర్ జనరల్ అలీ జహన్‌షాహీ స్పష్టం చేశారు. తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే సహించేది లేదని, ప్రతిదాడి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు బయటకు మాత్రం ఇరాన్‌తో చర్చలకు తొందరేం లేదు.. వారి వద్ద సరిపడా నగదు లేదు అని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నప్పటికీ, లోపల మాత్రం అణు డీల్‌పై యూటర్న్ తీసుకుని అయినా ఒప్పందానికి రాక తప్పని పరిస్థితి నెలకొంది.
Also Read : బ్రిటన్ ఆర్మీకి చైనా షాక్.. గుడ్డిగా నమ్మితే ఇంతే మరి!









