Liquor Shops : హైదరాబాద్‌ లో ఆషాడ బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ ఆదివారం (ఆగస్టు 8) బోనాల పండుగ చివరిరోజు కావడంతో నగరవ్యాప్తంగా బోనాల పండుగ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో మద్యం దుకాణాలు క్లోజ్‌ కానున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సైబరాబాద్‌, మల్కాజిగిరి, హైదరాబాద్‌తోపాటు ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలో వైన్‌ షాపులు మూసివేయనున్నారు. ఈనెల 9న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలతో పాటు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న వైన్‌షాపులు కూడా మూసివేయాలని మూడు కమిషనరేట్ల కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని గోల్కొండ, రాజేంద్రనగర్‌ జోన్‌లలో ఆగస్టు 9, 10 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని నగర సీపీ వీసీ సజ్జనార్‌ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read : చేయూత కొత్త పింఛన్లకు నేటి నుంచి దరఖాస్తులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

అయితే ఈ విషయంలో కొన్ని మినహాయింపులను కూడా పోలీసులు ఇచ్చారు. స్టార్ హోటళ్లలో నిర్వహించే బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లకు ఈ ఆదేశాలు వర్తించవని సీపీలు వెల్లడించారు. అయితే సాధారణ వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్ బార్లు మాత్రం నిర్దేశించిన సమయానికి మూసివేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆదేశాలను సంబంధిత వ్యాపార సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు.

బోనాల పండుగ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ లో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ వేడుకలు నిర్వహించడం ఆనావాయతీ. మహిళలు అలంకరించిన బోనాలను తలపై పెట్టుకుని అమ్మవారి ఆలయాలకు తీసుకెళ్లడం, పోతురాజుల నృత్యాలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంటుంది.. ఆగస్టు 9న పాతబస్తీలోని లాల్‌దర్వాజా, హరిబౌలితో పాటు పలు ప్రాంతాల్లో బోనాల వేడుకలు జరగనున్నాయి. ఆగస్టు 10న తెలంగాణ ప్రభుత్వం బోనాల సందర్భంగా సెలవు ప్రకటించింది. దీంతో చివరి దశ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

Also Read : స్కూళ్లలో ఫీజుల వివరాలు డిస్‌ప్లే చేయాలి.. సీఎం రేవంత్ సంచలనం!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.