
Kangana Ranaut : కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ట్రెండ్ కారణంగా వీరిద్దరి పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రపంచం హృతిక్ రోషన్‌కు క్షమాపణ చెప్పాలి అంటూ రచయిత ఫ్రెడ్డీ బర్డీ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై హృతిక్ స్పందించారు. వాస్తవాలు తెలిసే వరకు ఏ విషయాన్నైనా తాను నమ్మనని, ఎవరినో ఇష్టపడలేదన్న కారణంతో మరొకరిని వెనుకేసుకురావడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అది తనతో ఉన్న పాత వివాదానికి సంబంధించినదేనని నెటిజన్లు చర్చించుకోవడం ప్రారంభించారు.
దీనిపై కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా తీవ్రంగా స్పందించారు. హృతిక్ తన భాగస్వామి సబా ఆజాద్‌తో సంతోషంగా ఉన్నందుకు తాను సంతోషిస్తున్నానని చెప్పారు. తన పేరును అడ్డుపెట్టుకుని నెటిజన్లు తనను ట్రోల్ చేస్తుంటే ఆపాల్సింది పోయి, ఇలాంటి వ్యాఖ్యలతో వివాదానికి ఆజ్యం పోయడం మీ భాగస్వామికి కూడా ఇబ్బందికరంగా మారుతుందని హృతిక్‌ను ఆమె హెచ్చరించారు. అనవసరమైన కామెంట్లు చేయడం మానుకోవాలని సూచించారు.
క్యాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్‌తో జరిగిన సోషల్ మీడియా వాదన ఈ కొత్త వివాదానికి కారణమైంది. తనను కంగనా టార్గెట్ చేయడానికి తాను చూడటానికి యంగ్ హృతిక్ రోషన్ లాగా ఉండటమే కారణమని సౌరవ్ దాస్ జోక్ చేశారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు హృతిక్, కంగనాల పాత గొడవలను మళ్లీ చర్చలోకి తెచ్చారు. అంతేకాకుండా, కంగనాను కించపరిచేలా ఉన్న ఒక మీమ్‌ను హృతిక్ లైక్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం ఈ వివాదానికి మరింత అగ్గి రాజేసింది.
కాగా, 2016లో కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూలో హృతిక్‌ను తన సిల్లీ ఎక్స్ అని సంబోధించడంతో వీరిద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం లీగల్ నోటీసులు పంపుకోవడం, ఆరోపణలు చేసుకోవడం తెలిసిందే. సుమారు దశాబ్దం గడిచినా వీరిద్దరి మధ్య పాత వివాదం సోషల్ మీడియాలో ఎప్పుడో ఒకసారి మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది.









