Ayodhya Donation Theft Case: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన అయోధ్య రామమందిర విరాళాల చోరీ, నిధుల దుర్వినియోగ ఆరోపణల కేసుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో పారదర్శకత, నిష్పాక్షికత అత్యంత కీలకమని స్పష్టం చేసిన న్యాయస్థానం, దర్యాప్తు వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేసులో పురోగతిపై తదుపరి రెండు వారాల్లోగా సమగ్రమైన స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించాలని దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.

ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం చేపట్టింది. విచారణ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని నిష్పాక్షిక విచారణ జరిపేందుకు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు కోర్టుకు నివేదించారు.

ఈ కేసులో భారీగా ఆర్థిక లావాదేవీలు, విరాళాల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కోణాలు ఉన్నందున ఆర్థిక అంశాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే సాధారణ పోలీసు దర్యాప్తు మాత్రమే సరిపోదని, ఫోరెన్సిక్ ఆడిట్‌లో నైపుణ్యం కలిగిన చార్టర్డ్ అకౌంటెంట్‌ను (CA) కూడా సిట్‌లో తప్పనిసరిగా భాగస్వామిగా చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు సూచనకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, ఫోరెన్సిక్ ఆడిట్ నిపుణుడిని సిట్‌లో చేర్చేందుకు అంగీకరించింది.

Also Read : SSY పథకం: రోజుకు రూ.50 పొదుపు చేస్తే.. రూ.8.30 లక్షలు మీ సొంతం.. ఇలా చేస్తే చాలు..!

పునర్వ్యవస్థీకరించిన ఈ కొత్త సిట్ (SIT) బృందానికి లక్నో రేంజ్ ఐజీ కిరణ్ ఎస్. నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు అయిన అయోధ్య రేంజ్ డీఐజీ సోమెన్ బర్మా, అయోధ్య ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. అనుభవజ్ఞులైన ఐపీఎస్ అధికారులతో పాటు ఫోరెన్సిక్ ఆడిటర్‌ను చేర్చడం వల్ల విరాళాల లెక్కింపు, నిధుల మళ్లింపు ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజాలు త్వరితగతిన బయటకు వస్తాయని ధర్మాసనం భావించింది.

విచారణ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆలయానికి వస్తున్న నిధులు, విరాళాలు, ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆలయ ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, ఈ అభ్యర్థనపై సొలిసిటర్ జనరల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ అంశాన్ని అనవసరంగా సంచలనం చేయకూడదని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతానికి తమ ప్రధాన దృష్టి విచారణను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయడంపైనే ఉందని, అందువల్ల వెబ్‌సైట్‌లో వివరాల వెల్లడిపై ఎలాంటి తక్షణ ఆదేశాలు ఇవ్వడం లేదని కోర్టు స్పష్టం చేసింది.

సిట్ సమర్పించే స్టేటస్ రిపోర్టును పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు లేదా మార్గదర్శకాలపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. అత్యున్నత న్యాయస్థానం నేరుగా దర్యాప్తును పర్యవేక్షిస్తుండటం, ఫోరెన్సిక్ ఆడిట్ నిపుణుడిని చేర్చడంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకోనుంది.

Also Read : లక్షల్లో జీతాలు అందించే టాప్ 3 ఫైనాన్స్ కోర్సులు: విద్యార్థులకు పండగే..!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.