Top Finance Courses
Top Finance Courses

చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్, డిగ్రీ తర్వాత ఏ కోర్సు ను ఎంచుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. ఉన్నత స్థాయిలకు చేరుకోవడానికి బలమైన పునాది ఎక్కడ నుంచి వేయాలో ఆలోచించి ఆలస్యం చేస్తూ.. చివరికి ఏదో ఒక కోర్సు తీసుకుని.. ఆ తర్వాత బాధపడుతుంటారు. అయితే ప్రతి విద్యార్థి మంచి స్థాయిలో ఉద్యోగం పొంది.. భారీగా జీతాలు సంపాదించే మూడు కోర్సులు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ప్రస్తుతం కామర్స్, ఫైనాన్స్ రంగానికి మంచి డిమాండ్ ఉంది. ఉన్నత స్థాయికి చేరుకోవాలని అనుకునే ప్రతి విద్యార్థి ఇంటర్ లేదా డిగ్రీ చేసిన తర్వాత CA(చార్టర్డ్ అకౌంటెన్సీ), MBA ఫైనాన్స్ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), CFA (చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్) వంటి కోర్సులను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మూడు కోర్సులు అత్యుత్తమమైనవే. అందువల్ల వీటిని ఎంచుకునే ముందు.. ఈ కోర్సుల్లో ఏమేమి బోధిస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు వీటి స్టడీ పద్ధతులు, ఫీజులు, ఉద్యోగ అవకాశాలు, జీతం సహా మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

Also Read : కేంద్రం హామీల ఉల్లంఘన.. సీజేపీ ఆరోపణ.. విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం.. సుప్రీంకోర్టు ఆగ్రహం!

బోధన, ఫీజులు, ఉద్యోగం, జీతం వివరాలిలా..

CA(చార్టర్డ్ అకౌంటెన్సీ): టాక్సేషన్ (భారతీయ పన్ను విధానం), ఆడిటింగ్, అకౌంటింగ్, కార్పొరేట్ చట్టాలపై బోధిస్తారు. మీకు పన్నుల ఆదా చేయడం, బ్యాలెన్స్ షీట్ ఆడిట్ చేయడం, కంపెనీ ఆర్థిక చట్టాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం ఇష్టమైతే CA కోర్సు ఎంచుకోవచ్చు.

12వ తరగతి తర్వాత చేస్తారు. దీనికి సుమారు 4.5 నుండి 5 సంవత్సరాలు పడుతుంది. ఇందులో మూడు స్థాయిలు (ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్) ఉంటాయి. అలాగే రెండు సంవత్సరాల ప్రాక్టికల్ ఆర్టికల్‌షిప్ (ట్రైనింగ్) ఉంటుంది.

మొత్తం కోర్సు రిజిస్ట్రేషన్, పరీక్ష ఖర్చులు రూ.80,000 నుండి రూ.1.5 లక్షల వరకు ఉంటాయి. అయితే కోచింగ్ ఖర్చులు విడిగా పెట్టుకోవలసి ఉంటుంది.

ఆడిటర్, కంపెనీ సీఎఫ్ఓ, టాక్స్ కన్సల్టెంట్, ఫైనాన్షియల్ అడ్వైజర్‌లో ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభ జీతం ఏడాదికి రూ.8లక్షల నుండి రూ.12 లక్షల వరకు ఉంటుంది. అంతేకాకుండా సొంతంగా CA ప్రాక్టీస్ ఆఫీస్ కూడా పెట్టుకోవచ్చు.

MBA ఫైనాన్స్: ఇందులో బిజినెస్ మేనేజ్మెంట్, లీడర్‌షిప్, కార్పొరేట్ వ్యూహాలపై భోధన ఉంటుంది. కాబట్టి డెసిషన్ మేకింగ్, కంపెనీ బడ్జెట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటివి ఇష్టమైతే ఈ కోర్సు తీసుకోవచ్చు.

దీనిని డిగ్రీ తర్వాత చేస్తారు. ఇది 2 ఏళ్ల పాటు రెగ్యులర్ ఫుల్-టైమ్ కోర్సు. ఇందులో అడ్మిషన్ పొందాలంటే CAT/MAT వంటి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కాలేజీలో చేరాలి.

ఈ కోర్సుకు భారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టాప్ బి-స్కూల్స్ (IIMలు లేదా ప్రైవేట్ కాలేజీలు) నుండి ఈ కోర్సు చేయాలంటే దాదాపు రూ.15లక్షల నుండి రూ.25 లక్షల వరకు ఖర్చు పెట్టాలి.

కార్పొరేట్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, బిజినెస్ కన్సల్టెంట్‌లో ఉద్యోగాలు ఉంటాయి. వీటికి ఏడాదికి రూ.12లక్షల నుంచి రూ.20లక్షలకు పైగానే జీతం ఉంటుంది.

CFA (చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్): గ్లోబల్ ఇన్వెస్టిమెంట్, పోర్ట్ ఫోలియో మేనేజ్మెంట్, ఈక్విటీ రీసెర్చ్ వంటివి ఉంటాయి. దీని ద్వారా స్టాక్ మార్కెట్ విశ్లేషణ, సెక్యూరిటీ వాల్యుయేషన్, మ్యూచువల్ ఫండ్స్ వంటి నైపుణ్యాలు నేర్చుకోవచ్చు.

గ్రాడ్యుయేషన్ సమయంలో లేదా తర్వాత ఈ కోర్సు చేయవచ్చు. ఇందులో మూడు స్థాయిలు ఉంటాయి. అవి Level 1, Level 2, Level 3. ఈ కోర్సును కంప్లీట్ చేయడానికి 2 నుండి 3 ఏళ్లు పడుతుంది.

ఇది ఒక ఇంటర్నేషనల్ కోర్సు. అందువల్ల ఫీజులు డాలర్లలో చెల్లించాలి. ఈ మొత్తం కోర్సుకు రూ.2.5లక్షల నుండి రూ.4లక్షల వరకు ఖర్చు అవుతుంది.

ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్, పోర్ట్ ఫోలియో మేనేజర్, ఫండ్ మేనేజర్, రిస్క్ మేనేజర్‌లో ఉద్యోగాలు పొందొచ్చు. ఏడాదికి రూ.8 లక్షల నుండి రూ.15లక్షల వరకు జీతాలుంటాయి.

Also Read : ప్రపంచాన్ని వణికిస్తున్న భారత్ పినాకా.. 44 సెకన్లలో శత్రువులు ఖతం.. పోటీపడుతున్న 12 దేశాలు