
kumki elephant :అది ఉత్తరాంధ్ర… విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు. ఏ క్షణాన ఏ గజరాజు గ్రామం మీదపడుతుందో తెలియక ఆ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సైరన్లు మోగించారు… లాభం లేదు. బాణసంచా కాల్చారు… భయపడలేదు. అన్నీ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. భయం రెట్టింపైంది.. రాత్రి అయితే చాలు.. కంటి మీద కునుకు లేదు. కష్టపడి పండించిన అరటి, వరి, చెరుకు పంటలు క్షణాల్లో నేలమట్టం. మన్యం ప్రాంతానికి భరోసా ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టుగా.. ఏనుగులకు ఏనుగులతోనే సమాధానం చెప్పాలని అనుకున్నారు. అటు కర్ణాటక నుంచి, ఇటు చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిన కుంకీ ఏనుగులను రంగంలోకి దింపారు. వాటి పేర్లు జయంత్, అభిమన్యు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ స్వయంగా స్వాగతం పలికిన ఆ రెండు ‘కుంకీ’ ఏనుగుల అసలు కథేంటి? అసలు అడవి ఏనుగులను అదుపు చేసే ఈ ‘కుంకీ’ల వెనుక ఉన్న పవర్ ఏంటి? డీటెల్‌గా తెలుసుకుందాం…
ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం… ప్రకృతి అందాలకు నెలవు. కానీ గత కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో భయాందోళనలు రాజ్యమేలుతున్నాయి. ఒడిశా సరిహద్దుల గుండా గుంపులు గుంపులుగా వస్తున్న అడవి ఏనుగులు జనవాసాల పైకి విరుచుకుపడుతున్నాయి. ఎకరాల కొద్దీ వేసిన అరటి, వరి, చెరుకు తోటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. రక్తం చెమటగా మార్చి పండించిన పంట కళ్లముందే పాడవుతుంటే రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. పంట నష్టమే కాదు… ఏనుగుల దాడిలో ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి. దీంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న మన్యం వాసుల ఆక్రందనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి.
మన్యం ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడమే ప్రభుత్వ కర్తవ్యం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. మాటలతో కాదు… చేతలతో యాక్షన్ ప్లాన్ అమల్లోకి తెచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఏనుగుల సంరక్షణ కేంద్రం నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి రప్పించారు. పవన్ స్వయంగా ఈ ఏనుగులకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. పూలమాలలు వేసి గౌరవించారు. ఏనుగులకు ఎంతో ఇష్టమైన చెరుకు గెడలు, అరటిపండ్లు తినిపించారు. గజరాజుల విధ్వంసానికి అడ్డుకట్ట వేసే ఆపరేషన్ ముందడుగు పడింది. ప్రత్యేక వాహనాల్లో ఈ రెండు కుంకీలను పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకు పంపుతూ పవన్ కల్యాణ్ వీడ్కోలు పలికారు. అడవి ఏనుగులను అదుపు చేయడంలో ఇవి అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
అసలు ఏంటి ఈ కుంకీ ఏనుగుల ప్రత్యేకత? సాధారణ ఏనుగులకు, వీటికి ఉన్న తేడా ఏంటి? ఇవి అడవి ఏనుగులను ఎలా కంట్రోల్ చేస్తాయో హిస్టారికల్ అండ్ సైంటిఫిక్‌గా చూద్దాం.. కుంకీ అనే పదం పర్షియన్ భాషలోని ‘కుమాక్’ నుంచి వచ్చింది. కుమాక్ అంటే సహాయం అని అర్థం. పూర్వం రాజుల కాలం యుద్ధ రంగంలో సహాయక చర్యలకు, బరువులు ఎత్తే పనులకు శిక్షణ పొందిన ఏనుగులు వాడేవారు. భారతీయ భాషల్లోకి వచ్చేసరికి ఆ పదం కుంకీగా మారింది. కుంకీ ఏనుగులు అంటే సాధారణ ఏనుగులు కావు. ఇవి స్పెషల్ ట్రైనింగ్ పొందిన ‘కమాండోల’ లాంటివి. అడవి ఏనుగుల దాడిని తట్టుకుని, వాటిని తిప్పికొట్టేలా మగ ఏనుగులకు కఠినమైన శిక్షణ ఇస్తారు. మగ ఏనుగులు శారీరకంగా చాలా బలంగా ఉంటాయి. మదమెక్కిన అడవి ఏనుగుతో నేరుగా తలపడి, దాని అణచివేసి, వెనక్కి తగ్గేలా చేసే సత్తా ఈ కుంకీలకే ఉంటుంది. పంటలను రక్షించాలన్నా, మనుషుల ప్రాణాలను కాపాడాలన్నా, అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగులను తిరిగి అడవుల్లోకి పంపాలన్నా కుంకీలే ఏకైక పరిష్కారం.
ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమి క్యాంపునకు వెళ్తున్న ‘జయంత్’, ‘అభిమన్యు’ సాదాసీదా ఏనుగులు కావు. వీటి ట్రాక్ రికార్డ్ వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇప్పటివరకు ఆరు మేజర్ ఆపరేషన్లను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసిన రియల్ హీరోలు ఇవి. ఈ రెండు ఏనుగుల బ్యాక్‌గ్రౌండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
జయంత్: నానియాల్ ఏనుగుల శిబిరంలో అత్యంత కఠినమైన శిక్షణ పొందిన కుంకీ.
అభిమన్యు: కర్ణాటక అడవుల నుంచి తెచ్చి, పలమనేరు క్యాంపులో రౌద్రానికి, వ్యూహానికి పదును పెట్టిన ధీరుడు.
ఇటీవల పలమనేరు సమీపంలో ఒక ఒంటరి మగ ఏనుగు భయాందోళనలు సృష్టించింది. ఆపరేషన్ చాలా ప్రమాదకరంగా మారింది. ఆ సమయంలో రంగంలోకి దిగిన జయంత్, అభిమన్యు… చాకచక్యంతో ఆ అడవి ఏనుగును బంధించడంలో కీ రోల్ ప్లే చేశాయి. ఒకవైపు జయంత్ బలం… మరోవైపు అభిమన్యు వ్యూహం. ఈ రెండింటి కాంబినేషన్ ముందు ఎలాంటి అడవి ఏనుగైనా తలవంచాల్సిందే. అందుకే అటవీ శాఖ అధికారులు ఈ రెండు ఏనుగుల కాంబినేషన్‌ను ఎంపిక చేసి మన్యం రక్షణ కోసం పంపుతున్నారు.
కుంకీ ఏనుగులను రప్పించడంతోనే డిప్యూటీ సీఎం ఆగలేదు. అటు ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఏనుగుల మళ్లింపునకు చర్యలు చేపట్టడంతో పాటు, మోడర్న్ టెక్నాలజీని కూడా రంగంలోకి దింపుతున్నారు. మన్యంలో శాశ్వత పరిష్కారం కోసం అటవీ శాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఏఐ ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఏనుగుల కదలికలను ముందే పసిగట్టడం. దట్టమైన అడవుల్లో డ్రోన్లతో నిరంతర నిఘా. ఏనుగులు గ్రామాల వైపు రాకుండా కందకాలు తవ్వడం, అడవిలోనే నీటి వనరులు పెంచడం. అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు. గుచ్చిమి క్యాంప్‌లో మొదలైన ఈ ఆపరేషన్‌తో పార్వతీపురం, విజయనగరం జిల్లాల రైతులకు రిలీఫ్ దొరకనుంది.









