High Court : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసైట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి అత్యంత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ లోతుకుంట పరిధిలోని భూముల విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం హైడ్రా అధికారుల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆర్మీ భూముల్లోకి చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా ప్రవేశిస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని, అవసరమైతే సంకెళ్లు వేయాలని ఆర్మీని తీవ్రస్థాయిలో ఆదేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

లోతుకుంట పరిధిలోని శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వివాదాస్పద స్థలంలోకి హైడ్రా అధికారులు మళ్లీ ప్రవేశించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ (AG) కోర్టుకు అండర్‌టేకింగ్ ఇచ్చినా, రెండు రోజుల క్రితమే క్లాస్ పీకినప్పటికీ అధికారులు తమ వైఖరి మార్చుకోకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు, కోర్టు ఉత్తర్వుల పట్ల హైడ్రా అధికారులకు కనీస గౌరవం లేదని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Also Read : ఏసీబీ వలలో రూ.400 కోట్ల అవినీతి తిమింగలం.. రెడ్కో డీఈ ముత్యం అక్రమాస్తుల గుట్టురట్టు!

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం, ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలను పదే పదే ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ అధికారుల తీరు ఇలాగే కొనసాగితే వారిని ఆర్మీ కస్టడీకి అప్పగించేందుకు కూడా వెనకాడబోమని, అవసరమైతే హైడ్రా కమిషనర్‌ను ఆర్మీ బ్యారక్స్‌లో ఉంచాలని సూచిస్తామని ధర్మాసనం ఘాటుగా హెచ్చరించింది.

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు కోర్టు ఉత్తర్వులను సమర్థవంతంగా అమలు చేయడం కోసం సదరు వివాదాస్పద భూమి వద్ద ఆర్మీ బలగాలను మోహరించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ స్థలానికి రక్షణగా 10 మంది జవాన్లను కాపలా ఉంచాలని ఆర్మీ వర్గాలకు సూచించింది. కోర్టు స్టే ఉత్తర్వులను ఉల్లంఘించి హైడ్రా అధికారులు మళ్లీ అక్కడకు వస్తే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, వారు వచ్చిన వాహనాలను కూడా తక్షణమే సీజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల పరిరక్షణ పేరుతో ప్రైవేట్, కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద భూముల్లోకి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించడం చట్టవిరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. లోతుకుంట భూముల విషయంలో మళ్లీ ఏ రకమైన జోక్యానికి దిగినా, ఆ విషయాన్ని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు సూచించింది. చట్టపరిధిని దాటి ప్రవర్తించే ఏ అధికారిని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది.

రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలపై హైడ్రా వరుస బుల్డోజర్ చర్యలతో వార్తల్లో నిలుస్తున్న వేళ, అత్యున్నత న్యాయస్థానం ఈ స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం హైడ్రా చర్యలను సమర్థిస్తుండగా, మరోవైపు కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై న్యాయస్థానం సంకెళ్లు వేస్తామని, ఆర్మీ కస్టడీకి ఇస్తామని వ్యాఖ్యానించడం అధికారులకు గట్టి ఎదురుదెబ్బగా మారింది.

Also Read : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు మృతి!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.