sharad pawar

Sharad Pawar :  దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్‌సీపీ చీఫ్ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే భేటీ కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

ఈ సమావేశంలో శరద్ పవార్, ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశానికి సంబంధించిన ఫొటోల్లో ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం, ప్రధాని మోదీ స్వయంగా శరద్ పవార్‌ను తన గది వద్దకు వెళ్లి ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలతో కూడిన వినతిపత్రాన్ని శరద్ పవార్ ప్రధానికి అందజేశారు.

అయితే ఈ భేటీ కేవలం రైతుల సమస్యలకే పరిమితమా? లేక దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మరోసారి డీలిమిటేషన్ బిల్లును తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లుకు రెండు మూడొంతుల మెజారిటీ అవసరం కావడంతో ఎన్‌సీపీ కి చెందిన ఎనిమిది మంది ఎంపీల మద్దతు ప్రభుత్వానికి కీలకంగా మారింది.

డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం మేర సీట్ల పెంపుపై లిఖితపూర్వక హామీ ఇస్తేనే మద్దతు అంశంపై చర్చిస్తామని ఇటీవల సుప్రియా సూలే స్పష్టం చేశారు. 50 శాతం సీట్ల పెంపుపై రాతపూర్వక హామీ ఇవ్వండి.. ఆ తర్వాత మేము చర్చిస్తామని ఆమె పేర్కొన్నారు.

Also Read : ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేత!

ఇదిలా ఉండగా, శరద్ పవార్ వర్గం ఎన్డీఏలో చేరే అవకాశాలపై కూడా కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, శరద్ పవార్ వర్గాన్ని ఎన్డీఏలోకి తీసుకోవాలంటే ముందుగా ఎన్‌సీపీలోని రెండు ప్రత్యర్థి వర్గాలు తిరిగి ఒక్కటవ్వాలని పార్టీ స్పష్టమైన అభిప్రాయంతో ఉంది.

మహారాష్ట్రలో ఇటీవల రెండు ఎన్‌సీపీ వర్గాల నేతలు, అధికార కూటమి కీలక నేతల మధ్య వరుస భేటీలు జరగడంతో రాజకీయ పునఃకలయికపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే శరద్ పవార్ లేదా ఆయన వర్గాన్ని వ్యక్తిగతంగా ఎన్డీఏలో చేర్చుకునే ఆలోచన బీజేపీకి లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న రోజునే శరద్ పవార్, సుప్రియా సూలే…. ప్రధాని మోదీతో భేటీ కావడం మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ కొత్త చర్చకు తెరలేపింది.

మరోవైపు నీట్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఎందుకు తొలగించలేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం భయంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులకు పార్టీ మద్దతును పునరుద్ఘాటిస్తూ, విద్యార్థుల డిమాండ్లు నెరవేరే వరకు ప్రతిపక్షం తమ ఆందోళనను కొనసాగిస్తుందని ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు.

Also Read : డెంగ్యూ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు నుంచి అరవై ఏళ్ల వారికి!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.