CJP Protests :నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ కార్యకర్తలు, యువత ఢిల్లీలో తలపెట్టిన ‘చలో పార్లమెంట్’ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ సమావేశాల తొలి రోజే చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, భారీ సంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు బారికేడ్లను దాటుకుని ముందడుగు వేసేందుకు యత్నించారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతను అడ్డుకునేందుకు పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు గోళాలను ప్రయోగించి, లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి, అలాగే పలు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి.

సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరసనకారులపై పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. తన ఆమరణ నిరాహార దీక్ష 23వ రోజుకు చేరిన సందర్భంగా, భద్రతా దళాలు యువత పట్ల క్రూరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తన దీక్షను విరమించేది లేదని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

తమ నిరసనను విరమించాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే రెండు డిమాండ్లలో ఒకదాన్ని నెరవేర్చాలని వాంగ్‌చుక్ కోరారు. సీజేపీ యువ నాయకులను సంసద్ భవన్‌లో పార్లమెంట్ సభ్యులను (MPs) కలిసేందుకు అనుమతించాలని, లేదా ఆసుపత్రిలో ఉన్న తనను కలిసేందుకైనా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు యువతకు వారి అభిప్రాయాలను పార్లమెంటులో చెప్పుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ చేతితో రాసిన సందేశం (చీటీ) ని ఆయన భార్య గీతాంజలి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా బహిరంగపరిచారు. నిరసనకారులను ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ వారు చూపించిన సంయమనం తపస్సు లాంటిదని, వారి స్ఫూర్తి తనను తీవ్రంగా కదిలించిందని వాంగ్‌చుక్ అందులో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా యువత ఇదే రీతిలో శాంతియుతంగా తమ నిరసన తెలియజేయాలని ఆకాంక్షించారు.

పరీక్షల వ్యవస్థలో తలెత్తుతున్న వరుస లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును త్రిశంకు స్వర్గంలో పడేస్తున్నాయని వాంగ్‌చుక్ పేర్కొన్నారు. విద్యారంగంలో జరుగుతున్న ఈ తీవ్ర వైఫల్యాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రిని జవాబుదారుడిగా చేసేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు తన లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం, వైద్య చికిత్సకు సంబంధించి న్యాయస్థానంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆసుపత్రి నుంచి వాంగ్‌చుక్ డిశ్చార్జ్‌ను తిరస్కరిస్తూ సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై ఆయన భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్, వాంగ్‌చుక్‌కు సంబంధించిన అన్ని వైద్య నివేదికలను (Medical Reports), రికార్డులను సమర్పించాలని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, ఎయిమ్స్ (AIIMS), మరియు సంబంధిత ప్రైవేటు ల్యాబ్‌లను ఆదేశించింది.

ఉద్రిక్త పరిస్థితుల నడుమ సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పరీక్షల ప్రక్షాళన, విద్యాశాఖ మంత్రి రాజీనామా సహా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. అయితే, తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు తమ శాంతియుత నిరసనలు, వాంగ్‌చుక్ దీక్ష కొనసాగుతాయని స్పష్టం చేశారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.