PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. టోక్యో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750’ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సింధు.. విజేతగా నిలిచింది. తన కెరీర్‌లో మొట్టమొదటిసారిగా ఈ టైటిల్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా, జపాన్ ఓపెన్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షట్లర్‌గా‌ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో జపాన్ స్టార్ ప్లేయర్, డిఫెండింగ్ ఛాంపియన్ అకానె యామగుచీని సింధు చిత్తు చేసింది.

ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం నుంచే పీవీ సింధు కోర్టుపై పూర్తి నియంత్రణ సాధిస్తూ విపరీతమైన దూకుడును ప్రదర్శించింది. తన పక్కా ప్రణాళికతో అద్భుతమైన నెట్ గేమ్ ఆడుతూ, క్రాస్‌కోర్ట్ డ్రాప్స్, శక్తివంతమైన బాడీ స్మాష్‌లతో యమగుచిపై ఒత్తిడి పెంచింది. తొలి గేమ్‌లో జపాన్ క్రీడాకారిణి గట్టి పోటీ ఇచ్చి ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ, సింధు క్రమశిక్షణ, నిగ్రహంతో కూడిన ఆట తీరుతో అద్భుతంగా పుంజుకుంది. కీలక సమయాల్లో వరుస పాయింట్లు సాధిస్తూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా 21-17తో మొదటి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

మొదటి గేమ్‌ను గెలిచిన పట్టుదలతో రెండో గేమ్‌లోనూ సింధు తన అటాకింగ్ గేమ్‌ను మరింత ముమ్మరం చేసింది. యమగుచి నెట్ గేమ్‌ను సమర్థంగా తిప్పికొడుతూ, బంతిని నెట్‌కు దగ్గరగా ఉంచుతూ పాయింట్లు రాబట్టింది. ఒక దశలో మ్యాచ్ హోరాహోరీగా సాగినప్పటికీ, చివరి వరకు అదే జోరును కొనసాగించిన సింధు 21-17తో రెండో గేమ్‌ను కూడా ముగించింది. మొత్తంగా 21-17, 21-17 తేడాతో వరుస గేమ్స్‌లో ఘన విజయం సాధించి, జపాన్ ఓపెన్ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది.

పీవీ సింధు కెరీర్‌లో ఇదొక అత్యంత కీలకమైన , చరిత్రాత్మకమైన విజయంగా నిలిచిపోనుంది. జపాన్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం అకానె యమగూచికి ఇది ఆరోసారి కాగా, గత నాలుగేళ్లుగా ఆమెపై పూర్తి స్థాయిలో ఆడిన ఏ మ్యాచ్‌లోనూ సింధు విజయం సాధించలేకపోయింది. ఈ ఏడాది మలేషియా ఓపెన్‌లో వీరిద్దరూ తలపడినప్పటికీ, తొలి గేమ్ తర్వాత యమగూచి గాయం కారణంగా వైదొలిగింది. అటువంటి బలమైన ప్రత్యర్థిని, ఆమె సొంత గడ్డపైనే వరుస గేమ్స్‌లో ఓడించడం ద్వారా సింధు తన సత్తాను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.

కొంతకాలంగా సరైన టైటిల్ లేక, ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న పీవీ సింధుకు ఈ విజయం కొండంత ఊరటను, రెట్టింపు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ విజయంతో ఆమె సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 2024లో ‘సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్’ టైటిల్ గెలిచిన తర్వాత సింధుకు ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్ కావడం గమనార్హం. అంతేకాకుండా, ఆమె కెరీర్‌లో ఇది మొట్టమొదటి సూపర్ 750 టైటిల్ కావడం విశేషం. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత సింధు కెరీర్‌లో నమోదైన అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

ఈ చరిత్రాత్మక గెలుపుతో పీవీ సింధు భారత బ్యాడ్మింటన్ రంగంలో తన అగ్రస్థానాన్ని మరోసారి భద్రపరుచుకుంది. ఒక అంతర్జాతీయ సూపర్ 750 టోర్నీలో ఛాంపియన్‌గా నిలవడం ద్వారా రాబోయే సవాలుతో కూడిన టోర్నమెంట్లకు ఆమె ఘనమైన పునాది వేసుకుంది. క్లిష్ట పరిస్థితుల నుంచి పుంజుకుని టైటిల్ సాధించిన సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రీడా ప్రముఖులు, అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.