Pakistan :  పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యంపై అత్యంత భీకరమైన దాడికి పాల్పడింది. మస్తుంగ్ జిల్లాలోని ఖద్కోచా ప్రాంతంలో సైనికులను తరలిస్తున్న బస్సుల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని, బీఎల్ఏకు చెందిన ఫతే స్క్వాడ్ ఈ దాడిని నిర్వహించింది. ఈ ఘటనలో 45 మందికి పైగా పాకిస్థానీ సైనికులు మరణించినట్లు సమాచారం. దాడి ఎంత తీవ్రంగా ఉందంటే, సైనిక బస్సులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాధితులకు సహాయం చేయడానికి వచ్చిన అదనపు బలగాలపై కూడా తిరుగుబాటుదారులు మెరుపు దాడి చేయడంతో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

ఈ దాడికి తామే బాధ్యులమని బీఎల్ఏ అధికారికంగా ప్రకటించింది. పాకిస్థానీ భద్రతా దళాలు, నిఘా సంస్థలను లక్ష్యంగా చేసుకుని పనిచేసే తమ ‘ఫతే స్క్వాడ్’ ఈ ఆపరేషన్‌ను చేపట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం మస్తుంగ్ , పరిసర ప్రాంతాల్లో పాక్ సైన్యానికి, బలోచ్ తిరుగుబాటుదారులకు మధ్య తీవ్రస్థాయిలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో పాక్ సైన్యం అక్కడ కదలడానికి ఇబ్బందులు పడుతోంది.

Also Read : సింధు జలాల ఒప్పందం: భారత్‌ బిల్లు కడుతున్న పాకిస్థాన్‌ !

ఈ వివాదం దశాబ్దాలుగా నలుగుతోంది. బలూచిస్తాన్ సహజ వనరులతో సమృద్ధిగా ఉన్నప్పటికీ, పాకిస్థానీ పాలకులు తమ వనరులను దోచుకుంటున్నారని, స్థానికులు మాత్రం కటిక పేదరికంలోనే మగ్గుతున్నారని బలోచ్ ప్రజలు ఆరోపిస్తున్నారు. అందుకే, పాకిస్థాన్ నుండి బలూచిస్తాన్‌కు పూర్తి స్వేచ్ఛ కావాలని బీఎల్ఏ వంటి సంస్థలు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి.

అయితే, ఈ ఘోర ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి పాకిస్థాన్ ఎప్పటిలాగే విదేశీ కుట్రలనే నిందిస్తోంది. ఈ దాడుల వెనుక భారత్, ఆఫ్ఘనిస్తాన్ హస్తం ఉందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. కానీ, బలూచిస్తాన్‌లో పాక్ ప్రభుత్వం తన పట్టును కోల్పోతోందనేది వాస్తవమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : ట్రంప్‌ను చంపితే 10 మిలియన్ డాలర్లు… సంచలన ప్రకటన!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.