BRS  :  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం హైదరాబాద్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమం నేపథ్యంలో తెలంగాణ భవన్‌ వద్ద భారీగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Also Read : క్రిస్టియన్ మైనారిటీలకు బంపర్ ఆఫర్.. రూ.50 వేలు, ఈ-బైక్స్ ఫ్రీ.. అప్లై చేసుకోవడం ఎలాగంటే?

రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తే, బీఆర్‌ఎస్ నేతల రక్తం చల్లితే పంటలు పండుతాయి అని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ క్రమంలోనే, సీఎం రేవంత్ రెడ్డికి రక్తదాహం ఉందేమో, అందుకే మా రక్తాన్ని తీసుకెళ్లి ఆయనకు అందిస్తాం అంటూ బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో వినూత్న నిరసనకు దిగారు.

రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని సీఎం నివాసానికి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా, పోలీసులు వారిని తెలంగాణ భవన్ వద్దే అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.

బీఆర్‌ఎస్ చేస్తున్న ఈ ఆందోళనపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ, కేసీఆర్ ప్రభుత్వం నాటి అవినీతి బాగోతాలను ప్రదర్శించే చిత్రపటాలతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కాళేశ్వరం వైఫల్యాలను, ప్రాజెక్టుల పేరిట జరిగిన దోపిడీని ఎండగడుతూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ , పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది.

Also Read : స్విట్జర్లాండ్ టూర్ పేరుతో రూ. 50 కోట్లకు ఐపీ.. హైదరాబాద్ జంట జంప్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.