
Jharkhand : జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో జరిగిన ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పల్మా గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారిపై సునీల్ లోహ్రా అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు రాకుండా, గ్రామ పంచాయతీ పెద్దలు చాలా అమానవీయంగా వ్యవహరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించాల్సింది పోయి, పంచాయతీ పెద్దలు ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించి ఈ కేసును అక్కడికక్కడే సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు.
నిందితుడు సునీల్ లోహ్రా శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ చిన్నారి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పాప తల్లి ఇంటి పనుల్లో బిజీగా ఉండటంతో, పాపను తాను చూసుకుంటానని నమ్మబలికాడు. ఆ తర్వాత పాపను గదిలోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు. పాప ఏడుపు విని తల్లి గదిలోకి పరిగెత్తగా, పాప రక్తస్రావం అవుతూ కనిపించింది. ఈ దారుణం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, పంచాయతీ పెద్దలు రంగంలోకి దిగి విషయాన్ని బయటకు పొక్కకుండా చూశారు.
Also Read : హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు బిగ్ షాక్.. భారీగా లేఆఫ్‌లు!
లక్ష రూపాయల జరిమానా
ఈ కేసును రాజీ చేసే క్రమంలో పంచాయతీ సభ్యులు నిందితుడికి లక్ష రూపాయల జరిమానా వేశారు. అందులో భాగంగా వెంటనే రూ. 20 వేలను వసూలు చేశారు. విచిత్రం ఏమిటంటే, ఈ రూ. 20 వేలతో పంచాయతీ సభ్యులు మందు, మాంసంతో విందు చేసుకున్నారు. మిగిలిన రూ. 80 వేలను వారం రోజుల్లో చెల్లించాలని నిందితుడిని ఆదేశించారు. గ్రామస్తుల ఒత్తిడి కారణంగా పాప తల్లి మొదట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
అయితే, ఈ ఘటనపై పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో వారు వెంటనే స్పందించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పాప తల్లి నుంచి వివరాలు సేకరించారు. వెంటనే కేసు నమోదు చేసి, నిందితుడు సునీల్ లోహ్రాను అరెస్టు చేశారు. పోలీసులు గ్రామానికి వెళ్ళిన సమయానికి, నిందితుడు ఇచ్చిన డబ్బులతో పంచాయతీ పెద్దలు మద్యం తాగుతూ విందులో బిజీగా ఉన్నారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : వీధి కుక్కల బెడదకు చెక్.. కేరళ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ ‘సెన్స్-కె9’ స్మార్ట్ వాచ్!









