దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన ఆపరేషన్లలో టెక్నాలజీ, ఆటోమేషన్‌ను వేగంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ తన ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకుంది. ఏడాదిలో దాదాపుగా 3,343 మంది ఉద్యోగులను తగ్గించినట్లు తెలుస్తోంది. ఎక్కువగా బ్యాంక్ ఆపరేషన్స్, బ్యాక్-ఆఫీస్ విభాగాల్లోనే ఈ ఉద్యోగాల తగ్గింపు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సూపర్‌వైజరీ బాధ్యతలు లేని క్లరికల్, సబ్‌ఆర్డినేట్ సిబ్బంది సంఖ్య 8 వేల కంటే ఎక్కువగా తగ్గి 1,62,797కు చేరుకుంది. అయితే అదే సమయంలో జూనియర్-లెవల్‌లో 3,543 మంది, మిడ్-లెవల్ లో 1,252 మంది, సీనియర్ మేనేజ్‌మెంట్‌లో 15 మంది కొత్తగా చేరారు. టెక్నాలజీ పెరగడం వల్ల రోజువారీ సాధారణ పనులను ఆటోమేషన్ ద్వారా నిర్వహిస్తూ.. ఉద్యోగులను ఎక్కువ విలువ ఉన్న కస్టమర్ సేవలు, సలహా సేవల వైపు మళ్లిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.

కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. జేపీమోర్గాన్ చేస్, సిటీగ్రూప్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి అంతర్జాతీయ బ్యాంకుల అధికారులు కూడా ఏఐ వల్ల భవిష్యత్తులో కొన్ని ఉద్యోగాల అవసరం తగ్గుతుందని.. కానీ బ్యాంకుల ఉత్పాదకత మాత్రం పెరుగుతుందని ఇప్పటికే హెచ్చరించారు. టెక్నాలజీ ఆధారిత, కస్టమర్-కేంద్రిత బ్యాంక్‌గా మారే దిశగా తాము వేగంగా ముందుకు వెళ్తున్నామని, అందుకు అనుగుణంగా ఉద్యోగులు కూడా తమ నైపుణ్యాలను పెంచుకోవాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) శశిధర్ జగదీశన్ స్పష్టం చేశారు.