
Mojtaba Khamenei :మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర యుద్ధ వాతావరణం, అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి అత్యంత ఉద్రిక్తకర పరిస్థితులకు దారితీసింది. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ నివాసంపై అమెరికా , ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన వినాశకర వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఇటీవల జులై మొదట్లో అనేక రోజులు సాగిన అంత్యక్రియల ఊరేగింపుల అనంతరం, జులై 9న మషద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర ప్రాంగణంలో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఈ పరిణామాల అనంతరం ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ టెలిగ్రామ్ ద్వారా ఒక సంచలన సందేశాన్ని విడుదల చేస్తూ, తండ్రి మృతికి కారకులైన వారిపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటిస్తూ తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఈ దాడులు ,యుద్ధంలో అమరులైన ఇరాన్, ఇరాక్ ప్రజలందరి రక్లానికి ప్రతీకారం తీర్చుకోవడం దేశవ్యాప్త డిమాండ్ అని స్పష్టం చేశారు. ఈ ప్రతికార చర్య అనేది కేవలం తన ఒక్కరి నాయకత్వం లేదా కొందరు అధికారుల నిర్ణయంపై మాత్రమే ఆధారపడి లేదని, ఇది సమగ్ర ఇరాన్ జాతీయ సంకల్పమని పేర్కొన్నారు. శత్రువులకు కోలుకోలేని రీతిలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. ఫిబ్రవరి 28 నాటి దాడిలో తీవ్రంగా గాయపడటం, అలాగే భద్రతా కారణాల వల్ల మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడం ,తండ్రి అంత్యక్రియల ప్రార్థనలకు కూడా హాజరుకాకపోవడం గమనార్హం.
ఇరాన్ నుంచి వస్తున్న తీవ్ర ముప్పు , ప్రతీకార హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రంగా స్పందించారు. నూతన నాయకత్వం గానీ లేదా ఇరాన్ దళాలు గానీ అమెరికా ప్రయోజనాలపై లేదా తమ బలగాలపై ఏ చిన్న దాడికి పాల్పడినా ఊహించని రీతిలో భారీ ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. గల్ఫ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన అమెరికా నౌకాదళం, యుద్ధ విమానాలు ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఇరాన్ ఎలాంటి సాహసానికి ఒడిగట్టినా ఆ దేశానికి తీవ్ర నష్టం తప్పదని వైట్ హౌస్ వర్గాలు కూడా స్పష్టం చేశాయి.
అయితే, ఒకవైపు యుద్ద వాతావరణం భయపెడుతున్నప్పటికీ, మరోవైపు ఉద్రిక్తతలను తగ్గించేందుకు తెరవెనుక దౌత్య ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ తీవ్రతను అదుపులోకి తెచ్చేందుకు ఇరాన్ ప్రతినిధుల బృందం శనివారం ఓమన్ వేదికగా అమెరికా ప్రతినిధులతో రహస్య చర్చలు ప్రారంభించింది. గల్ఫ్ జలసంధి అయిన ‘హోర్ముజ్’ (Strait of Hormuz) ప్రాంతంలో అంతర్జాతీయ చమురు ట్యాంకర్లపై ఇటీవల జరిగిన దాడులు పొరపాటున చోటుచేసుకున్నాయని, అమెరికాతో జరుగుతున్న దౌత్య చర్చలను భగ్నం చేసేందుకు ఇరాన్‌లోని కొందరు తీవ్రవాద భావజాలం ఉన్న మూలకలే ఈ కుట్రకు పాల్పడ్డాయని ఇరాన్ దౌత్యవేత్తలు అమెరికా సలహాదారులకు వివరణ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
గత నాలుగు నెలలుగా ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, జూన్ మధ్యలో కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం రెండు పక్షాలు శాంతి మార్గాలను అన్వేషిస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిలో శాంతి భద్రతలను పునరుద్ధరించడంపై ఇరుదేశాలు ప్రధానంగా దృష్టి సారించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుతూ, తమకు ఇరాన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవడం లేదా పరిస్థితికి శాశ్వత ముగింపు పలకడం అనే రెండు మార్గాలు ఉన్నాయని, దౌత్య చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని వ్యాఖ్యానించడం విశేషం.
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఈ క్లిష్టమైన పరిస్థితి ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ విప్లవ దళాలు (IRGC) ప్రతీకార దాడికి సన్నాహాలు చేస్తున్నట్లు సంకేతాలు ఇస్తుండగా, మరోవైపు ఒమన్‌లో జరుగుతున్న చర్చలు ఎంతవరకు కొలిక్కి వస్తాయనేది ఉత్కంఠగా మారింది. దౌత్య చర్చలు విఫలమైతే గల్ఫ్ ప్రాంతం మరో భారీ యుద్ధానికి వేదికయ్యే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.









