
COVID-19 : వైఎస్సార్ కడప జిల్లాలో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. కడప నగరంలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో ఇద్దరు రోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. బాధితులు గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరం, జలుబు, తగ్గని దగ్గుతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చిన వైద్యులు వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఇద్దరికీ కరోనా సోకినట్లు స్పష్టమవ్వడంతో వారిని రిమ్స్‌లోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే, ఈ కీలక విషయాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు బయటకు పొక్కకుండా తీవ్రంగా గోప్యత పాటిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, వివరాలు వెల్లడించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారంపై స్పష్టత కోసం ప్రయత్నించిన మీడియా ప్రతినిధులకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (DHO) అందుబాటులోకి రాకపోవడమే కాకుండా, ఫోన్ కాల్స్‌కు కూడా స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రిలోని సిబ్బంది మాత్రం రెండు పాజిటివ్ కేసులు నమోదైన మాట వాస్తవమేనని ధ్రువీకరిస్తున్నారు.
మరోవైపు, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రాజంపేటకు చెందిన ఒక వ్యక్తి కూడా కరోనా లక్షణాలతోనే మరణించి ఉంటారని వైద్యవర్గాల్లో బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులు దాటినా జ్వరం, ఊపిరితిత్తుల సమస్యలు తగ్గకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కడప జిల్లాలో ఇన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నా డిహెచ్‌ఓ సహా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా ‘మొద్దునిద్ర’పోతున్నారంటూ జిల్లా ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించి, వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.









