దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Stock Markets) బుధవారం దారుణంగా కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిపోయిందంటూ చేసిన ఒక్క ప్రకటన అంతర్జాతీయ విపణిలో తీవ్ర సంచలనం రేపగా, దానికి ప్రతిబింబంగా భారత మార్కెట్లు అమాంతం పతనమయ్యాయి. బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు దాదాపు 2 శాతానికి పైగా కుంగాయి. మార్కెట్లో సంభవించిన ఈ తీవ్ర ఒడుదొడుకులు, విక్రయాల ప్రభావితంతో కేవలం ఒక్కరోజులోనే దాదాపు రూ.8 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైపోయింది.

పశ్చిమాసియా ప్రాంతంలో చోటుచేసుకుంటున్న తీవ్ర సైనిక ఉద్రిక్తతల నీడలోనే బుధవారం ఉదయం సూచీలు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రితం ముగింపు 78,180 పాయింట్లతో పోలిస్తే సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల నష్టంతో 77,816 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. మధ్యాహ్నం వరకు మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులతో కొనసాగినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత ఒకానొక దశలో పరిస్థితి పూర్తిగా దిగజారింది. ట్రంప్ వ్యాఖ్యలు వెలువడిన కేవలం 30 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లు పడిపోవడం మార్కెట్ తీవ్రతకు అద్దం పట్టింది.

ట్రేడింగ్ చివర్లో ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 1800 పాయింట్లకు పైగా క్షీణించి ఆందోళన రేకెత్తించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1677.12 పాయింట్లు (2.15%) నష్టపోయి 76,503.60 వద్ద స్థిరపడింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ 516.65 పాయింట్లు క్షీణించి 23,882.05 వద్ద ముగిసింది. కీలకమైన 24,000 మార్క్‌ను నిఫ్టీ కోల్పోవడం ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచింది. ఇటు డిమాండ్ తగ్గింపు అంచనాల నేపథ్యంలో పసిడి, వెండి ధరలు దిగొచ్చాయి; విశేషంగా వెండి ధర రూ.6,000 మేర తగ్గింది.

Also Read : అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. బహ్రెయిన్, కువైట్‌లలోని యూఎస్ బేస్‌లపై క్షిపణులతో దాడి!

నేటి ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాల సూచీలు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ షేరు ఏకంగా 12 శాతం మేర కుంగిపోగా.. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకీ, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇంధన, లోహ రంగానికి చెందిన ఓఎన్‌జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా ,బజాజ్ ఆటో షేర్లు స్వల్ప లాభాలను నమోదు చేసి కాస్త ఉపశమనం అందించాయి.

ఈ ఆకస్మిక పతనానికి ప్రధానంగా పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ భయాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్‌లు పరస్పర దాడులకు దిగడం, టెహ్రాన్‌తో సీజ్‌ఫైర్‌ ముగిసిందని, వారితో చర్చలు జరపడం వ్యర్థమని డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేయడంతో గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా పానిక్ మోడ్‌లోకి వెళ్లాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 6 శాతం పెరిగి బ్యారెల్‌కు 78.56 డాలర్లకు చేరడం భారత్ లాంటి చమురు దిగుమతి దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.

మరోవైపు అంతర్జాతీయ ప్రతికూలతలతో భారత రూపాయి విలువ సైతం తీవ్ర ఒత్తిడికి లోనై క్షీణించింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే మరో 63 పైసలు తగ్గి 95.59 వద్ద చారిత్రక కనిష్ఠానికి సమీపంలో స్థిరపడింది. అంతర్జాతీయంగా వాల్‌స్ట్రీట్ ఫ్యూచర్స్ కూడా భారీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. నాస్‌డాక్ 1.5 శాతం, డోజోన్స్ ఫ్యూచర్స్ 1.2 శాతం, ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 1 శాతం మేర పతనమవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

Also Read : ఇరాన్‌కు బిగ్ షాకిచ్చిన అమెరికా.. భారీగా పెరగనున్న క్రూడ్ ఆయిల్ ధరలు

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.