Dharani Portal : సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన భూముల అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించేందుకు విజిలెన్స్ దర్యాప్తు లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. రోజురోజుకూ వెలుగులోకి వస్తున్న ధరణి దారుణాలు, సాంకేతిక లోపాలపై సర్కార్ చాలా సీరియస్‌గా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో భూ యజమానులకు కనీసం తెలియకుండానే, వారి అంగీకారం లేకుండానే లక్షల ఎకరాల భూములు చేతులు మారిపోయినట్లు తెలుస్తోంది.

కేరళకు చెందిన ఒక ప్రముఖ సెక్యూరిటీ ఆడిట్ సంస్థ ఇచ్చిన నివేదికలో ధరణి పోర్టల్‌లో జరిగిన షాకింగ్ అక్రమాలు బయటపడ్డాయి. సాధారణంగా రిజిస్ట్రేషన్ జరగాలంటే భూమి అసలు యజమాని వేలిముద్ర లేదా మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ తప్పనిసరి. కానీ, ధరణిలో ఈ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టేలా చేసేలా కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్లను వాడినట్లు ఆడిట్‌లో తేలింది. దీనివల్ల విదేశాల్లోనో, ఇతర ప్రాంతాల్లోనో ఉంటున్న భూ యజమానులకు అస్సలు తెలియకుండానే.. వారి పేర్లను మార్చేసి ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్లు చేసేశారు.

ఈ నివేదిక ప్రకారం.. ధరణిలో జరిగిన దాదాపు 8 లక్షల భూ లావాదేవీలపై ఆడిట్ నిర్వహించగా, అందులో ఏకంగా 22 వేల రిజిస్ట్రేషన్లలో భారీ తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే.. అసలు ఉనికిలోనే లేని ఘోస్ట్ ఐడీలను సృష్టించి, వాటి ద్వారా లక్షల ఎకరాల భూముల రికార్డులను ఇష్టమొచ్చినట్లు మార్చేశారు. అంతేకాదు, కంప్యూటర్లలోని టైమ్ క్లాక్‌ను వెనక్కి మార్చి పాత తేదీలతో రిజిస్ట్రేషన్లు కానిచ్చేశారు.

ఈ దారుణాలపై పూర్తి ఆధారాలు లభించడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో ఎవరెవరి హస్తం ఉంది? ఏఏ సాఫ్ట్‌వేర్లను వాడారు? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? అనే విషయాలను తేల్చడానికి ఒక ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.