Ayatollah Ali Khamenei : ఇరాన్‌ను సుదీర్ఘకాలం పాటు (1989 నుండి 2026 వరకు) పరిపాలించిన ఆ దేశ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో తీవ్ర భావోద్వేగాల మధ్య ప్రారంభమయ్యాయి. టెహ్రాన్‌లోని ప్రసిద్ధ ఇస్లామిక్ ప్రార్థనా స్థలం ‘ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లా’ కాంప్లెక్స్ లక్షలాది మంది ఇరానీయులతో కిక్కిరిసిపోయింది. ఈ అంత్యక్రియల ప్రార్థనలు కేవలం శోకసంద్రంగానే కాకుండా, అమెరికా, ఇజ్రాయెల్‌లపై తీవ్ర ప్రతీకారం తీర్చుకోవాలనే నినాదాలతో హోరెత్తాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా జరిపిన ఒక భీకర వైమానిక దాడిలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ దుర్మరణం పాలయ్యారు. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. నాటి నుండి పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం, అలజడుల కారణంగా ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ అంత్యక్రియలను అప్పట్లో నిర్వహించలేకపోయింది. రక్షణ,భద్రతా కారణాల వల్ల దాదాపు నాలుగు నెలల పాటు ఆలస్యమైన తర్వాత, ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు వారం రోజుల పాటు సాగే ఈ భారీ అంత్యక్రియల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. శనివారం ప్రారంభమైన ఈ అంతిమయాత్ర కార్యక్రమాలు ఇరాన్ ,ఇరాక్‌లోని మొత్తం ఐదు ప్రధాన నగరాల్లో ఏడు రోజుల పాటు కొనసాగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఆదివారం నాటి సామూహిక ప్రార్థనల ప్రారంభానికి కొన్ని గంటల ముందే ముసల్లాలోని ప్రధాన ప్రాంగణమంతా జనసందోహంతో నిండిపోయింది. ప్రార్థనా మందిరంలో చేరిన లక్షలాది మంది ప్రజలు ఇరాన్ జాతీయ జెండాలతో పాటు, ప్రతీకారానికి చిహ్నంగా భావించే ఎరుపు రంగు జెండాలను పెద్ద ఎత్తున ప్రదర్శిస్తూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఈ అంత్యక్రియల వేదికగా ఇరాన్ ప్రజలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఖమేనీ మృతికి ప్రధాన కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను అంతమొందించాలంటూ రాసి ఉన్న పెద్ద ఎత్తున ప్లకార్డులు, పోస్టర్లు, గ్రాఫిటీలను నిరసనకారులు ప్రదర్శించారు.ఈ సందర్భంగా ‘అమెరికా నశించాలి, ఇజ్రాయెల్ నశించాలి’ (డెత్ ఆఫ్ అమెరికా) అనే నినాదాల మధ్య ఇరాన్ మిలటరీ త్రివిధ దళాధిపతులు, అగ్రశ్రేణి నాయకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌ను నడిపిస్తున్న మొహమ్మద్ రసౌలి అనే కవి లౌడ్‌స్పీకర్లలో మాట్లాడుతూ.. “ఇకపై శవాల కఫనే మా వస్త్రం. ఖమేనీ రక్తం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం.. ట్రంప్‌ను హతమార్చడం ఇకపై మా బాధ్యత” అని పిలుపునివ్వడంతో లీడర్లు, ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.

Also Read : శ్రీలంక జైల్లో రక్తపాతం : 20 మంది మృతి.. 100 మందికి పైగా తీవ్ర గాయాలు!

అంత్యక్రియల వేళ శవపేటికల వద్ద కుమారులు
అధికారిక అంత్యక్రియల ప్రార్థనల సమయంలో అలీ ఖమేనీ ముగ్గురు కుమారులు అయిన ముస్తఫా, మసౌద్, మేసమ్ ఖమేనీలు హాజరై తమ తండ్రి శవపేటిక వెనుక నిలబడి అంజలి ఘటించారు. ఇరాన్ జాతీయ జెండాతో కప్పబడిన అలీ ఖమేనీ శవపేటికపై ఆయన సాంప్రదాయక నల్లటి తలపాగాను ఉంచారు.ఫిబ్రవరిలో జరిగిన వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు మరణించిన ఆయన కుమార్తె బుష్రా, కోడలు, అల్లుడు, కేవలం 14 నెలల వయసున్న ఆయన మనవరాలి శవపేటికలను కూడా అక్కడ పక్కపక్కనే ఉంచారు. ఈ ప్రార్థనల సమయంలో ఖమేనీ కుమారుడు మసౌద్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడి వారిని కదిలించింది.

అయితే, ఈ అధికారిక ప్రార్థనలలో అలీ ఖమేనీ వారసుడు, ఆయన మరణం తర్వాత ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మోజ్తబా ఖమేనీ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. మోజ్తబా ఖమేనీని కూడా లక్ష్యంగా చేసుకుని హత్య చేస్తామని ఇజ్రాయెల్ బెదిరిస్తున్న నేపథ్యంలో, తీవ్రమైన భద్రతాపరమైన కారణాల వల్ల ఆయన తన తండ్రి అంత్యక్రియల కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈ అంత్యక్రియల మహోత్సవంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్-ఇన్-చీఫ్ అహ్మద్ వాహిదీ తదితర దేశ కీలక రంగాల నేతలు పాల్గొని నివాళులర్పించారు.

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి నివాళులర్పిస్తూ ఎక్స్‌ (ట్విట్టర్) లో భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టారు. అలీ ఖమేనీ వారసత్వం ప్రపంచ దేశాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని, ఆయన జ్ఞాపకాలను తాను ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేశారు. తాను అమరవీరుడైన తన నాయకుడికి ఎప్పటికీ వీడ్కోలు పలకనని, ఆయన తన గుండెల్లో సజీవంగా ఉంటారని పెజెష్కియన్ పేర్కొన్నారు.అలీ ఖమేనీ,ఆయన కుటుంబ సభ్యుల పార్థీవదేహాల వద్ద ఆదివారం టెహ్రాన్‌లో ప్రార్థనలు పూర్తి చేసిన అనంతరం సోమవారం వాటిని అధికారికంగా తరలిస్తారు. మంగళవారం ఇరాన్‌లోని పవిత్ర నగరమైన ఖోమ్‌ (Qom) లో భారీ అంత్యక్రియల ఊరేగింపు నిర్వహించనున్నారు.

ఖోమ్‌ నగరంలో ఊరేగింపు ముగిసిన తర్వాత, ఖమేనీ భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో పొరుగు దేశమైన ఇరాక్‌కు తరలిస్తారు. ఇరాక్‌లోని అత్యంత పవిత్ర ఇస్లామిక్ నగరాలైన నజఫ్, కర్బలా నగరాలలో ప్రజల సందర్శనార్థం ఉంచి అక్కడ కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇరాక్ పర్యటన ముగిసిన అనంతరం, గురువారం (జులై 9వ తేదీన) ఖమేనీ భౌతికకాయాన్ని తిరిగి ఇరాన్‌కు తీసుకువస్తారు. ఆయన సొంత పట్టణమైన ఇరాన్‌లోని మషద్ (Mashhad) నగరంలో అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో అంతిమంగా ఖననం చేయనున్నారు.

ఇదిలావుండగా, ఖమేనీ అంత్యక్రియల సమయంలో తాము ఎలాంటి కాల్పులు లేదా దాడులు జరపబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ రాయబార కార్యాలయం తీవ్రంగా మండిపడింది. ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఒక కంటితుడుపు చర్యగా కొట్టిపారేసింది. అర్మేనియాలో ఇరాన్ రాయబారి ఖలీల్ షిర్‌ఘోలామి ఎక్స్‌ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌లపై విరుచుకుపడ్డారు. “మీరు మనుషులను చంపగలరు కానీ వారి ఆదర్శాలను చంపలేరు. మీరు అయతుల్లా ఖమేనీని చంపడం ద్వారా ఒక అత్తరు సీసాను పగులగొట్టారు, ఇప్పుడు దాని సువాసన అంతటా వ్యాపించింది. నాగరికత, చరిత్ర, గౌరవం లేని మీకు ఈ విషయాలు ఎప్పటికీ అర్థం కావు” అంటూ ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.

Also Read : స్నాప్ చాట్ లవ్.. అమ్మాయి కోసం బోర్డర్ దాటాడు.. ట్విస్ట్ ఏంటంటే!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.