
Sutluj Controversy :ఒక సినిమా.. మూడు పేర్లు.. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ వివాదం.. ఎట్టకేలకు ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా సడెన్‌గా ఓటీటీలో విడుదల.. కట్ చేస్తే, విడుదలైన తర్వాత కేవలం 48 గంటల్లోనే స్ట్రీమింగ్ నుండి పూర్తిగా తొలగింపు! ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోనే కాకుండా నెట్టింట తీవ్ర చర్చనీయాంశమవుతోన్న ‘సత్లుజ్’ చిత్రం పరిస్థితి ఇది. ప్రముఖ పంజాబీ నటుడు, స్టార్ సింగర్ దిల్జిత్ దొసాంజే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.
‘సత్లుజ్’ సినిమా పంజాబ్‌కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ‘జస్వంత్ సింగ్ ఖల్రా’ వాస్తవ జీవితం ఆధారంగా తెరకెక్కింది. 1980, 1990ల కాలంలో పంజాబ్‌లో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న సున్నితమైన నిజ జీవిత సంఘటనలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు హనీ ట్రెహన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. అమృత్‌సర్‌లో ఒక బ్యాంక్ డైరెక్టర్‌గా పనిచేసిన జస్వంత్ సింగ్ ఖల్రా, పంజాబ్ అల్లర్ల వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలను ప్రపంచానికి చాటిచెప్పిన వీరుడు.
1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్, ఆ తర్వాత చోటుచేసుకున్న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య, తదనంతర సిక్కు వ్యతిరేక ఆందోళనల తర్వాత పంజాబ్‌లో వేలాది మంది యువకులు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. వారిని వివిధ కారణాలు చూపుతూ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత ఎన్కౌంటర్ల పేరిట చంపేసి గుట్టుచప్పుడు కాకుండా అనాథ శవాలుగా దహనం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ దారుణాలపై జస్వంత్ సింగ్ ఖల్రా స్వయంగా పరిశోధనలు జరిపారు.
జస్వంత్ సింగ్ ఖల్రా తన పరిశోధనల ద్వారా పంజాబ్‌లో అక్రమంగా శవదహనం చేసిన దాదాపు 2,000 మందికి పైగా సిక్కుల వివరాలను, బలమైన ఆధారాలను సేకరించి ప్రపంచం ముందుకు తెచ్చారు. ఆయన వెల్లడించిన ఈ సంచలన నిజాలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. అయితే, ఈ నిజాలు బయటపెట్టినందుకు గానూ 1995లో జస్వంత్ సింగ్ ఖల్రాను కొందరు అపహరించి దారుణంగా హత్య చేశారు. తదనంతర కాలంలో భారత సుప్రీం కోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా ఖల్రా సేకరించిన ఆధారాలను, నిజాలను సమర్థించాయి.
ఈ సున్నితమైన చారిత్రక కథను వెండితెరపై ఆవిష్కరించే క్రమంలో సినిమా పేర్లు మార్చాల్సి రావడం పెద్ద వివాదంగా మారింది. దర్శకుడు హనీ ట్రెహన్ తొలుత ఈ సినిమాను ‘ఘల్లుఘరా’ (Ghallughara) అనే పేరుతో ప్రకటించారు. పంజాబీ భాషలో దీని అర్థం ‘మారణకాండ’. అయితే ఈ పేరుపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో, ఆ తర్వాత దీనిని ‘పంజాబ్ 95’ (Panjab 95)గా మార్చారు. చివరకు ఎన్నో అడ్డంకుల దాటుకుని ఓటీటీలోకి వచ్చేసరికి ఈ చిత్రానికి ‘సత్లుజ్’ అనే పేరును ఖరారు చేశారు.
ఈ చిత్రం యొక్క షూటింగ్ 2022లోనే పూర్తయింది. అయితే సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికేషన్ కోసం పంపినప్పుడు మేకర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సినిమాలో ఉన్న రాజకీయ విషయాలు, రక్తపాతంతో కూడిన దృశ్యాలు వీక్షకులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. మొదటి విడతలో ఏకంగా 21 కట్స్‌ను సూచించింది. ఆ తర్వాత కూడా వివాదం ముదరడంతో, రెండోసారి ఏకంగా 127 కట్స్ (మార్పులు) చేయాలని డిమాండ్ చేసింది.
Also Read : అఖిలేష్ యాదవ్ ముందే పుష్-అప్స్.. వైరల్ గా మారిన వీడియో..ఇంతకు ఎవరీతను?
సెన్సార్ బోర్డు సూచించిన వందకు పైగా కట్స్ గనుక చేస్తే సినిమా ఒరిజినల్ ఆత్మ వాస్తవికత పూర్తిగా దెబ్బతింటుందని దర్శకుడు హనీ త్రేహన్, నిర్మాతలు భావించారు. బోర్డు డిమాండ్లకు లొంగేది లేదని స్పష్టం చేస్తూ వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ లీగల్ పోరాటం కారణంగానే సినిమా విడుదల మూడేళ్లకు పైగా ఆలస్యమైంది. నిజానికి 2023లోనే ప్రతిష్టాత్మక ‘టోరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (TIFF)లో ఈ సినిమా ప్రదర్శితం కావాల్సి ఉన్నప్పటికీ, కోర్టు తీర్పు పెండింగ్‌లో ఉండటంతో మేకర్స్ దానిని వెనక్కి తీసుకున్నారు.
ఎన్నికల పరిణామాలు, రాజకీయ సెన్సిటివిటీల నడుమ ఈ చిత్రాన్ని భారతదేశంలో థియేటర్లలో విడుదల చేయడం దాదాపు అసాధ్యమని నిర్మాతలు గ్రహించారు. అందుకే నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జులై 3వ తేదీన ఎలాంటి ముందస్తు ప్రచార ఆర్భాటాలు లేకుండా ‘సత్లుజ్’ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ (ZEE5) వేదికగా హఠాత్తుగా స్ట్రీమింగ్కు వచ్చింది.
సినిమా ఓటీటీ విడుదలై సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్న తరుణంలో హీరో దిల్జిత్ దొసాంజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. తాము ఓటీటీలో ఎలాంటి కట్స్ లేని ఒరిజినల్ వెర్షన్‌ను మాత్రమే విడుదల చేశామని ఆయన స్పష్టం చేశారు. సినిమాలో కనీసం ఒక్క కట్ ఉన్నా తాను ఈ చిత్రానికి మద్దతు ఇచ్చేవాడిని కాదని, ప్రమోట్ చేసేవాడిని కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ‘శహీద్ జస్వంత్ సింగ్ ఖల్రా జీ’ అంటూ ఆ మానవ హక్కుల పోరాట యోధుడికి నివాళులర్పించారు.
సినిమా చూసి పంజాబ్ చరిత్రను తెలుసుకోవచ్చని ఆశపడిన ప్రేక్షకులకు విడుదలైన 48 గంటల్లోనే పెద్ద షాక్ తగిలింది. భారతదేశంలో జీ5 యాప్ నుండి ‘సత్లుజ్’ సినిమా అకస్మాత్తుగా మాయమైపోయింది. భారతీయ వీక్షకులకు ఈ సినిమా స్ట్రీమింగ్ కాకుండా నిలిపివేయబడింది. అయితే, విదేశీ మార్కెట్లయిన అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ‘జీ5 గ్లోబల్’ వెర్షన్లో ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతుండటం గమనార్హం.
భారత్‌లో సినిమా ప్రదర్శన నిలిపివేయడంపై తీవ్ర దుమారం రేగడంతో జీ5 యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, చిత్ర నిర్మాతలకు, సీబీఎఫ్సీ (CBFC)కి మధ్య జరుగుతున్న కోర్టు వివాదాల కారణంగానే భారతదేశంలో ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము. భారతీయ ప్రేక్షకుల కోసం దీనిని మళ్లీ చట్టబద్ధమైన మార్గాల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాము” అని పేర్కొంది.
భారతదేశంలో ‘సత్లుజ్’ సినిమాను అకస్మాత్తుగా తొలగించడాన్ని పంజాబ్‌కు చెందిన రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శిరోమణి అకాలీ దళ్ (SAD) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సర్దార్ జస్వంత్ సింగ్ ఖల్రా చేసిన అత్యున్నత త్యాగాన్ని ఆవిష్కరించే ఇలాంటి శక్తిమంతమైన కథలను అణచివేయలేరు. ఇది ముమ్మాటికీ నిజంపై, భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడి” అని ఆయన మండిపడ్డారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) కూడా ఈ నిషేధాన్ని తప్పుపట్టింది.
సినిమాను ఓటీటీ నుండి తొలగించడంపై చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రముఖ నటుడు రణవీర్ షోరీ తన నిరాశను ‘ఎక్స్’లో పంచుకున్నారు. “చరిత్రను, కథలను దాచే సంస్కృతిని మన దేశంలో ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా నిరాశకరం” అంటూ ఆయన రాసుకొచ్చారు. దిల్జిత్ దొసాంజ్ నటనకు ఈ చిత్రంలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని ఆయన గుర్తుచేశారు.
భారీ తారాగణంతో రియలిస్టిక్ డ్రామాగా తెరకెక్కిన ‘సత్లుజ్’ చిత్రంలో దిల్జిత్ దొసాంజ్‌తో పాటు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, సువిందర్ విక్కీ, గీతికా విద్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర పంజాబ్ హింసాత్మక కాలంలోని యదార్థ గాథలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుందని టాక్ వచ్చింది. ప్రస్తుతం బాంబే హైకోర్టు తీర్పుపైనే ఈ సినిమా భవితవ్యం ఆధారపడి ఉండటంతో, భారతీయ ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : రాముడి డబ్బులతో జల్సాలు… తమ్ముడి పెళ్లికి లక్షలు!









