
Prashant Kishor: జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీహార్‌లోని ప్రతిష్టాత్మకమైన బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జూలై 30న జరగబోయే ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు. ఈ స్థానంలో ఎప్పటినుంచోBJPకి బలమైన పట్టు ఉంది. ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ సీటు ఖాళీ అయ్యింది. దీనివల్ల ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రశాంత్ కిశోర్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ ఎన్నిక ఇప్పుడు బీజేపీ వర్సెస్ జన్ సూరాజ్ పార్టీగా మారి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read : పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాకు కేంద్రం వార్నింగ్
బాంకీపూర్ స్థానానికి నితిన్ నవీన్ రాజీనామా చేయడంతో 182-బాంకీపూర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో బీహార్‌లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్‌లోని దతియా, గుజరాత్‌లోని మంజల్‌పూర్ లాంటి కీలక స్థానాలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడం కోసమే ఉపఎన్నికలు జరుపుతున్నట్లు ఎన్నికల సంఘం తన ప్రకటనలో తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని 22-దతియా నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేంద్ర భారతిపై అనర్హత వేటు పడటంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది. అలాగే గుజరాత్‌లోని 145-మంజల్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యోగేష్ భాయ్ నారందాస్ పటేల్ అకాల మరణం చెందడంతో ఆ సీటు ఖాళీ అయ్యింది.
ఈ ఉపఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జూలై 6వ తేదీ సోమవారం నాడు విడుదలవుతుంది. దీనితో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్లు వేయడానికి చివరి తేదీ జూలై 13. ఆ తర్వాత జూలై 14న నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవడానికి జూలై 16 వరకు సమయం ఉంటుంది. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ లోని ఈ మూడు స్థానాలకు జూలై 30న పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఆగస్టు 3వ తేదీ సోమవారం నాడు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read : 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..వాడివేడిగా సభ?









