Khamenei Granddaughter Coffin:  అమెరికా, ఇజ్రాయెల్‌ల సంయుక్త వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ టెహ్రాన్‌లో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేనీ భౌతికకాయాన్ని ఉంచిన ఇమామ్ ఖొమేని గ్రాండ్ మొసల్లా ప్రాంగణం లక్షలాది మంది జనసందోహంతో, శోకసంద్రంగా మారింది. అయితే, ఈ మహా జనసముద్రం మధ్య అందరినీ అత్యంత భావోద్వేగానికి గురిచేసి, ఇరాన్ ప్రజల గుండెలు పగిలేలా చేసిన ఒక దృశ్యం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఖమేనీ శవపేటికకు సరిగ్గా పక్కనే సుమారు 10 కిలోల బరువున్న ఒక చిన్న శవపేటికను ఉంచారు. అది ఏ సైనికుడిదో, రాజకీయ నాయకుడిదో కాదు.. కేవలం 14 నెలల వయసున్న ఖమేనీ మనవరాలు జాహ్రా మహమ్మది గోల్పాయేగానిది. యుద్ధం అంటే ఏంటో, శత్రుత్వం అంటే ఏంటో కూడా తెలియని ఆ పసికందు కిరాతక దాడికి బలైపోయింది. ఆ చిన్నారి శవపేటికను చూసి అక్కడ చేరిన వేలాది మంది ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. అదే సమయంలో అక్కడున్న ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ‘ఇంతికామ్’ (ప్రతీకారం) కావాలంటూ పెద్ద పెట్టున అరవడం మొదలుపెట్టారు.

ఒకే కుటుంబంలో ఐదు శవపేటికలు
ఇరాన్ మీడియా కథనాల ప్రకారం.. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా మరణించారు. ఇరాన్ జాతీయ జెండాను కప్పిన ఆ చిన్నారి జాహ్రా శవపేటిక పక్కనే ఆమె అందమైన ఫోటోను ఉంచారు. నివాళులర్పించేందుకు వస్తున్న వారంతా ఆ ఫోటోను చూసి తట్టుకోలేక ఏడుస్తూ ముందుకు సాగుతున్నారు. జాహ్రాతో పాటు ఖమేనీ అల్లుడు, ఆయన పెద్ద కుమార్తె, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయాతొల్లా మోజ్తబా ఖమేనీ భార్య శవపేటికలను కూడా పక్కపక్కనే ఉంచడంతో ఆ ప్రాంగణమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఈ సంతాప సభలో పాల్గొన్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఘాలిబఫ్, ఉన్నత స్థాయి సైనిక అధికారులు, ప్రపంచ దేశాల ప్రతినిధులు తరలివచ్చి అగ్రనేతకు శ్రద్ధాంజలి ఘటించారు. ఇరాన్ నిబంధనల ప్రకారం ఈ అంత్యక్రియల ప్రక్రియ పలు రోజుల పాటు సాగనుంది. జులై 5 నుంచి 7 వరకు టెహ్రాన్, ఖోమ్ నగరాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచి, అనంతరం జులై 9న ఖమేనీ సొంత పట్టణమైన మషహద్‌లో భౌతికకాయాన్ని ఖననం చేయనున్నారు.

ఒకవైపు శోకం.. మరోవైపు అమెరికా వేడుకలు
టెహ్రాన్‌కు వచ్చిన జనం కేవలం దుఃఖించడమే కాకుండా, అమెరికాపై తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ ‘అల్ జజీరా’ పేర్కొంది. నివాళులర్పించడానికి వచ్చిన వేలాది మంది యువకులు, ప్రజలు ‘డెత్ ఆఫ్ అమెరికా’ అంటూ ప్రతీకార నినాదాలతో హోరెత్తించారు. అయితే, ఇక్కడ ఇరాన్ ఇంతటి శోకంలో మునిగి ఉంటే.. అటు అమెరికా మాత్రం తన 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. పైగా ఇరాన్‌పై తాము జరిపిన ఈ దాడిని డోనాల్డ్ ట్రంప్ తన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా అభివర్ణిస్తూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.