
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. మనీ లాండరింగ్ కేసుల్లో భాగంగా తాము జప్తు చేసిన ఒక ప్రైవేట్ విమానాన్ని ఈడీ అధికారులు విజయవంతంగా బహిరంగ వేలం వేశారు. భారత్ యాంటీ మనీ లాండరింగ్ చట్టాల చరిత్రలో ఇలా ఒక విమానాన్ని వేలం వేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఈడీ గురువారం ప్రకటించిన వివరాల ప్రకారం.. హాకర్ 800A అనే ప్రైవేట్ విమానాన్ని కేంద్ర ప్రభుత్వ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఎమ్‌ఎస్‌టీసీ ద్వారా జూలై 1న బహిరంగ వేలం వేశారు. ఈ వేలంలో ఆ విమానం రూ.3 కోట్ల ధరకు అమ్ముడైంది. అమర్దీప్ కుమార్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరికొందరిపై నడుస్తున్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ అధికారులు గత ఏడాది మార్చి 7న శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోదాలు జరిపి ఈ ప్రైవేట్ విమానాన్ని సీజ్ చేశారు.
ఈడీ చరిత్రలోనే ఒక విమానాన్ని ఇలా పారదర్శకమైన పద్ధతిలో బహిరంగ డిజిటల్ వేలం వేసి విక్రయించడం ఇదే ప్రథమం. ప్రభుత్వ ఆస్తులను, జప్తు చేసిన ప్రాపర్టీలను వేలం వేసే అధికారిక ప్రభుత్వ సంస్థ ఎమ్‌ఎస్‌టీసీ ద్వారానే ఈ సేల్ ప్రక్రియను ముగించారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్న సమయంలో సీజ్ చేసిన ఆస్తులు వాడకుండా ఉంటే పాడైపోతాయని, వాటి విలువ తగ్గిపోకుండా కాపాడటానికి వాటిని ఇలా డబ్బు రూపంలోకి మార్చడం తమ వ్యూహంలో ఒక భాగమని అధికారులు తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు కోర్టుల్లో కేసులు సాగడం వల్ల స్వాధీనం చేసుకున్న ఆస్తులు వృథా కాకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఆస్తికి సరైన విలువ
గతంలో ఈడీ అధికారులు నిందితులకు చెందిన భూములు, ఇళ్లు, లగ్జరీ కార్లు, ఫ్యాక్టరీ మిషన్లను వేలం వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ, ఒక విమానాన్నే అమ్మేయడం అనేది ఒక సరికొత్త ముందడుగు. అమర్దీప్ కుమార్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థలపై ఉన్న అసలు కేసు విచారణ ప్రస్తుతం కోర్టులో సాగుతోంది. ఈ వేలం ప్రక్రియ విజయవంతం కావడంతో, భవిష్యత్తులో ఆర్థిక నేరగాళ్ల నుంచి సీజ్ చేసే ఇలాంటి పెద్ద పెద్ద విలువైని ఆస్తులను వేగంగా వేలం వేయడానికి ఒక మంచి మోడల్ దొరికినట్లయింది. ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆస్తులను అమ్మడం వల్ల పూర్తి పారదర్శకత ఉండటమే కాకుండా, ఆస్తికి సరైన విలువ కూడా వస్తుందని ఈ ఘటన నిరూపించింది.









