DSP Bheem Reddy
DSP Bheem Reddy

తెలంగాణలో రోజు రోజుకూ అవినీతి తిమింగలాల బండారం బయటపడుతోంది. ఏసీబీ సోదాల్లో కోట్లలో అక్రమ సొమ్ము గుర్తించడం సంచలనంగా మారుతోంది. తాజాగా ఈ తనిఖీల్లో మరొకరి గుట్టు రట్టైంది. తెలంగాణలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఓ DSP అడ్డంగా బుక్కయ్యారు. ఆయన నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏకకాకలంలో దాడులు జరపగా.. ఏకంగా రూ.200 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించి అధికారులు షాక్‌కు గురయ్యారు. వాటిలో లగ్జరీ ఇళ్లు, ఫ్లాట్లు, ఖరీదైన భూములు, భారీగా నగదు, బంగారాన్ని కనుగొన్నారు. ఇంకా వీటి లెక్కలు తేల్చడానికి మరో రెండు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఎవరా డీఎస్పీ అనే విషయానికొస్తే..

ఆయన పేరు భీమ్ రెడ్డి. తెలంగాణ డీజీపీ ఆఫీస్ స్టేషనరీ వింగ్‌లో డిస్పీగా పనిచేస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు తలెత్తడంతో ఏసీబీ బృందం రంగంలోకి దిగింది. ఇవాళ ఉదయం నుంచే ఏసీబీ అధికారులు భీమ్ రెడ్డి నివాసాలపై ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎవరూ ఊహించని అక్రమాస్తులు లభించడం తీవ్ర కలకలం రేపింది. ఆయన సంపాదించిన అక్రమాస్తుల విలువ దాదాపు రూ.200 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తుండటంతో పోలీస్ వర్గాలు షాక్‌కు గురవుతున్నాయి.

డీఎస్పీ భీమ్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, అత్యంత దగ్గరి వ్యక్తులపై కూడా అధికారులు గురిపెట్టారు. హైదరాబాద్, గచ్చిబౌలి, రంగారెడ్డి, జహీరాబాద్, శంషాబాద్, వికారాబాద్ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ సోదాలో మరో కీలకమైన వస్తువు అధికారులకు లభ్యమైంది. ఒక డైరీ వారి చేతికి చిక్కింది. ఆ డైరీ ఓపెన్ చేయగానే లెక్కల చిట్టా బయటపడింది. భీమ్ రెడ్డికి చెందిన దాదాపు 15 మంది బినామీల లెక్కలు బయటపడినట్లు సమాచారం.

దీంతో ఒక బినామీ ఇంట్లో రహస్య స్థావరం నుంచే దాదాపు రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కాగా భీమ్‌రెడ్డి ఇతర రాష్ట్రాల్లో సైతం భారగా పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. తన కూతురి పేరిట గచ్చిబౌలిలోని ఒక అపార్ట్‌మెంట్‌ కొనుగోలు, బెంగళూరులో ఒక ఎకరం ఖరీదైన ల్యాండ్ ఉన్నట్లు డాక్యుమెంట్లు, పలు ఓపెన్ ప్లాట్లు, సాగు భూములకు సంబంధించిన ల్యాండ్ల డాక్యుమెంట్లు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వీటితోపాటు బ్యాంక్ లాకర్లు, బినామీల అకౌంట్లను సెర్చ్ చేయడానికి మరో రెండు రోజుల పాటు తనిఖీలు చేయాల్సి ఉంటుందని ఏసీబీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇలా అక్రమాస్తులకు సంబంధించి కీలక ఆధారాలు లభించడంతో మరికొద్ది సేపట్లో డీఎస్పీ భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.