Whatsapp Username Feature
Whatsapp Username Feature

Whatspp Username : వాట్సాప్ త్వరలో తీసుకురానున్న కొత్త ‘యూజర్‌నేమ్’ (Username) ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నడుమ, కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ (Meta)కు కీలక నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై మూడు రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారతీయ పౌరులకు ఈ యూజర్‌నేమ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావద్దని (రోల్‌అవుట్‌ను నిలిపివేయాలని) కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అసలు ఏమిటీ ‘యూజర్‌నేమ్‌’ ఫీచర్‌?
సాధారణంగా వాట్సాప్‌లో ఎవరితోనైనా చాట్ చేయాలన్నా, గ్రూపుల్లో యాడ్ అవ్వాలన్నా ఫోన్ నంబర్ తప్పనిసరి. అయితే, యూజర్ల వ్యక్తిగత గోప్యతను (Privacy) మరింత కట్టుదిట్టం చేసేందుకు ఫోన్ నంబర్‌తో పనిలేకుండా కేవలం ఒక ప్రత్యేకమైన ‘యూజర్‌నేమ్’ ద్వారా ఇతరులతో చాట్ చేసే సదుపాయాన్ని మెటా సంస్థ ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. వినియోగదారులు తమ యాప్‌ను అప్‌డేట్ చేసుకుని, సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘సెలెక్టింగ్ యూజర్‌నేమ్’ ఆప్షన్ ద్వారా 3 నుంచి 35 క్యారెక్టర్ల పరిమితితో తమకు నచ్చిన పేరును రిజర్వ్ చేసుకోవచ్చు. కంటెంట్ క్రియేటర్లు, వ్యాపార సంస్థలు తమ బ్రాండ్ గుర్తింపు కోసం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఉన్న యూజర్‌నేమ్‌లనే వాట్సాప్‌కు కూడా వాడుకునేలా మెటా ఈ ప్లాన్ రూపొందించింది.

ప్రముఖులు, అత్యున్నత స్థాయి వ్యక్తుల పేర్లను ఇతరులు వాడుకోకుండా కొన్ని భద్రతా పరిమితులను కూడా వాట్సాప్ విధించింది. అపరిచితులతో చాట్ చేసేటప్పుడు ఫోన్ నంబర్ బయటకు తెలియకుండా భద్రత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని మెటా సమర్థించుకుంటోంది.నంబర్ల గోప్యత వరకు ఈ ఫీచర్ బాగున్నప్పటికీ, దీని వెనుక ఉన్న లూప్‌హోల్స్ (లోపాలు) పై సైబర్ భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణాలు ఇవే:

నకిలీ ప్రొఫైల్స్, మోసాలు: సెలబ్రిటీల పేర్లను నియంత్రించినప్పటికీ, సాధారణ అధికారులు, బ్యాంక్ ప్రతినిధులు లేదా సుపరిచితమైన వ్యక్తుల పేర్లతో నకిలీ యూజర్‌నేమ్స్ సృష్టించి ప్రజలను సులభంగా మోసం చేసే అవకాశం ఉంది.
టెలిగ్రామ్ తరహా ముప్పు: ఇప్పటికే టెలిగ్రామ్ (Telegram) యాప్‌లో ఇలాంటి యూజర్‌నేమ్ ఫీచర్ వల్లే విపరీతంగా స్కామ్‌లు, మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాట్సాప్‌ కూడా తగిన రక్షణ చర్యలు లేకుండా ఈ ఫీచర్ తెస్తే, ఇది కూడా సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్పామ్ సందేశాల వరద: గుర్తుతెలియని వ్యక్తులు ఏదో ఒక యూజర్‌నేమ్‌ను ఊహించి (Predict చేసి) నేరుగా మెసేజ్‌లు లేదా స్పామ్ కాల్స్ పంపే ప్రమాదం పొంచి ఉంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా కొద్దిమందికి మాత్రమే బీటా వర్షన్‌లో అందుబాటులో ఉంది. అయితే, భారత ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాల నేపథ్యంలో, దేశంలోని కోట్ల మంది వాట్సాప్ వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మెటా ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.