
Mavigan vs Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సంచలనానికి తెరలేపాయి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ప్రధాన అజెండాను ప్రకటిస్తూ, రాబోయే ఎన్నికల సమరం ‘మావిగన్ వర్సెస్ అమరావతి’గా మారబోతోందని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. రాష్ట్ర రాజధాని విషయంలో తాము ‘మావిగన్’ విధానానికే పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో కూడా ఈ ‘మావిగన్’ అంశాన్ని ప్రధానంగా చేర్చబోతున్నామని, ఈ సరికొత్త ప్రతిపాదనతోనే తాము ప్రజల ముందుకు వెళ్తామని వెల్లడించారు.
రాజధానిపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. తాను అమరావతి ప్రాంతంలో పర్యటిస్తే ‘జగన్ అమరావతికి వ్యతిరేకం’ అంటూ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను అమరావతికి గానీ, అక్కడి రైతులకు గానీ వ్యతిరేకం కాదని.. కేవలం చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో సాగిస్తున్న స్కామ్‌లను, అక్కడ జరిగిన అవినీతిని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. అవినీతికి తావు లేని, పారదర్శకమైన అభివృద్ధి సాధించడమే ‘మావిగన్’ ఉద్దేశమని జగన్ వివరించారు. రాజధాని నిర్మాణంలో ఎలాంటి స్కాములకు అవకాశం లేకుండా పారదర్శకంగా ముందుకు సాగాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. ‘మావిగన్’ విధానాన్ని మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారని, అమరావతిని సపోర్ట్ చేసే వాళ్లు చంద్రబాబుకు ఓటేస్తారని.. ప్రజల మద్దతు దేనికి ఉందో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుందని అన్నారు.
Also Read : MGNREGA స్థానంలో నేటినుంచి VB-G RAM G.. కనీస వేతనాల పెంపు?
రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై తాము నిరంతరం పోరాడతామని జగన్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో రైతుల ఆవేదనను తెలుసుకోవడానికి, అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించడానికి రిటైర్డ్ జడ్జి స్థాయి వ్యక్తులతో కూడిన కమిటీని పంపించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. తాను ఎల్లప్పుడూ రైతుల పక్షానే నిలబడతానని, ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పాలన సాగడం లేదని, దానికి బదులుగా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలవుతోందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో తాము రిజర్వేషన్లకు మతంతో సంబంధం లేదని స్పష్టమైన తీర్మానం చేశామని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టకుండా ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత పాలక పక్షంపై ఉందని హితవు పలికారు.
డీఎస్సీ (DSC) నియామకాల వ్యవహారంపై కూడా జగన్ స్పందించారు. తాము డీఎస్సీ అంశంలో అన్ని రకాల ఆధారాలతోనే మాట్లాడామని పేర్కొన్నారు. తమ పార్టీ చేసిన ఆరోపణలు తప్పని ప్రభుత్వం భావిస్తే, కేవలం ప్రచారం కోసం మాట్లాడటం పక్కన పెట్టి, వాటిని సరైన ఆధారాలతో ఖండించాలని సవాల్ విసిరారు. వాస్తవాలను ఆధారాలతో చెప్పినప్పుడే ప్రజలు నమ్ముతారని హితవు పలికారు.రాజకీయాల్లో పరస్పర విమర్శలు సహజమే అయినప్పటికీ, అధికార పక్షం సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరైంది కాదని జగన్ హితవు పలికారు. అధికార పార్టీ తన నాయకులను అదుపులో ఉంచుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలే పరమావధిగా ఎక్కడ సమస్య ఉన్నా తమ పార్టీ నాయకులు బాధితులకు అండగా నిలుస్తారని, ప్రజా ప్రయోజనాల కోసం వచ్చే ఉద్యమాల్లో అవసరమైతే తాను కూడా నేరుగా పాల్గొంటానని ప్రకటించారు.
వైఎస్ జగన్ చేసిన ఈ ‘మావిగన్’ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిమిషాల వ్యవధిలోనే తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ ఒకే రాజధానిగా అమరావతి కావాలని, కానీ గొడ్డలి పార్టీకి (వైసీపీ) మాత్రం అది అవసరం లేదని విమర్శించారు. గతంలో ‘మూడు రాజధానులు’ అంటూ మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జగన్ ఇప్పుడు మళ్లీ కొత్తగా ‘మావిగన్’ అంటున్నాడని, అసలు ఆ ‘మావిగన్’ అంటే ఏంటో నాకే అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. ఇరు పార్టీల అధినేతలు రాజధాని అంశంపై పరస్పర సవాళ్లు విసురుకోవడంతో ఏపీ రాజకీయం ‘మావిగన్ వర్సెస్ అమరావతి’ చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా వేడెక్కింది.
Also Read : మొగుణ్ణి వదిలేస్తా కానీ ప్రియుణ్ణి వదలను.. అడ్డంగా దొరికిపోయిన భార్య షాకింగ్ కామెంట్స్!









