భారత రవాణా రంగ చరిత్రను తిరగరాస్తూ దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలును పట్టాలెక్కించేందుకు ‘నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) శరవేగంగా అడుగులు వేస్తోంది. ముంబయి- అహ్మదాబాద్‌- సబర్మతి మధ్య చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా.. మరో 15 నెలల్లో, అంటే 2027 ఆగస్టు నాటికి తొలి విడతగా వాపి-బిలిమోరా-సూరత్‌ మధ్య 98 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలును పాక్షికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గంలో నడిపించేందుకు సిద్ధం చేసిన బుల్లెట్ రైలు చిత్రాన్ని రైల్వేశాఖ అధికారికంగా విడుదల చేసింది. ప్రారంభంలో ఈ రూట్‌లో రెండు బుల్లెట్ రైళ్లను నడపనున్నారు.

Also Read : తగ్గిన ముడిచమురు ధరలు… దిగిరాని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఎందుకో తెలుసా?

దశలవారీగా విస్తరణ.. 2029 నాటికి పూర్తి ప్రాజెక్ట్

ఈ భారీ ప్రాజెక్టును నాలుగు ప్రధాన దశల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2027 ఆగస్టులో తొలి మార్గం ప్రారంభమైన తర్వాత, అదే ఏడాది డిసెంబరు నాటికి వాపి నుంచి సబర్మతి వరకు 352 కి.మీ. కారిడార్‌ను పూర్తి చేస్తారు. అనంతరం 2028 డిసెంబరు నాటికి థానే-సబర్మతి (492 కి.మీ.) మార్గాన్ని, చివరగా 2029 డిసెంబరు నాటికి ముంబయి నుంచి సబర్మతి వరకు మొత్తం 508 కిలోమీటర్ల పూర్తి కారిడార్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా పూర్తయ్యే సమయానికి ఈ మార్గంలో మొత్తం 30 బుల్లెట్ రైళ్లను నడపాలని రైల్వేశాఖ యోచిస్తోంది.

గంటకు 320 కి.మీ. వేగం.. విమాన ప్రయాణ అనుభూతి

గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ముంబయి-అహ్మదాబాద్ మధ్య రవాణా ముఖచిత్రం మారిపోనుంది. పరిమిత స్టాపులతో ప్రయాణిస్తే ఈ 508 కి.మీ. దూరాన్ని కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఒకవేళ అన్ని స్టేషన్లలో ఆపినప్పటికీ 2 గంటల 58 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకుంటారు. విమానాశ్రయాల్లో ఉండే చెక్-ఇన్ టెన్షన్లు, రోడ్డు ప్రయాణాల్లో ఉండే ట్రాఫిక్ జామ్‌ల బాధలు లేకుండా అత్యంత వేగంగా, సుఖవంతంగా ప్రయాణించే వీలుండటంతో ఈ ప్రాజెక్టు దేశంలో సరికొత్త యుగానికి నాంది పలకనుంది.

నిర్మాణ పనుల పురోగతి వివరాలు

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వంద శాతం పూర్తయింది. మెట్రో రైలు తరహాలోనే బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌ను ఎత్తులో నిర్మించేందుకు చేపట్టిన భారీ కాంక్రీట్ స్తంభాల (పియర్లు) నిర్మాణం ఇప్పటికే 91 శాతం ముగిసింది. వీటిపై అమర్చే భారీ కాంక్రీట్ బీమ్‌ల తయారీ (గిర్డర్ కాస్టింగ్) పనులు 76 శాతం, వాటిని పియర్లపై అమర్చే పనులు (గిర్డర్ లాంచింగ్) 72 శాతం పూర్తయ్యాయి. ఇక రైలు పట్టాలకు బలమైన పునాదిగా నిలిచే ట్రాక్ బెడ్ పనులు 35 శాతం, ఎలక్ట్రిక్ వైర్లు, స్తంభాల ఏర్పాటుకు సంబంధించిన ఓహెచ్‌ఈ పనులు 33 శాతం మేర పూర్తయి వేగంగా ముందుకు సాగుతున్నాయి.

సముద్ర గర్భంలో సొరంగ మార్గం.. ప్రాజెక్టు ప్రత్యేకతలు

మొత్తం 508.90 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్ గుజరాత్ (349.03 కి.మీ.), దమన్‌దీవ్ (4.30 కి.మీ.), మహారాష్ట్ర (154.76 కి.మీ.) మీదుగా సాగుతుంది. ఈ మార్గంలో 91.58 శాతం (465.38 కి.మీ.) ఎత్తైన వయాడక్టులు, 1.93 శాతం వంతెనలు ఉంటాయి. అత్యంత వినూత్నంగా ఈ ప్రాజెక్టులో 26.22 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ముంబయి పరిధిలో వచ్చే 21 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో.. 7 కిలోమీటర్ల మేర సముద్ర గర్భం గుండా రైలు ప్రయాణించడం విశేషం. ఈ కారిడార్ మొత్తంపై గుజరాత్‌లో 8, మహారాష్ట్రలో 4 కలిపి మొత్తం 12 స్టేషన్లను నిర్మిస్తున్నారు.

Also Read : Olympics 2028 : క్రికెట్ అభిమానులకు శుభవార్త.. టీమిండియా బెర్త్ ఖరారు!

ఉన్నతాధికారుల సమీక్ష.. వేగంగా అడుగులు

ఇటీవలే నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) ఉన్నతాధికారులు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ మరియు ఇతర కీలక అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు సాధించిన పురోగతిని, నిర్మాణ విశేషాలను వారు వివరించారు. ఎక్కడా ఎలాంటి అడ్డంకులు లేకుండా గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.