Venezuela

Venezuela : వెనిజులా దేశంలో ఒక పక్కా గుండెల్ని పిండేసే సంఘటన జరిగింది. బుధవారం అక్కడ వచ్చిన భయంకరమైన భూకంపం వల్ల ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోయింది. ఆ సమయంలో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు హెక్టార్ బెల్లో భార్య ఆండ్రియా, కూలిపోతున్న భవనం కింద తన ఏడాది చిన్నారి నలిగిపోకుండా తన శరీరాన్ని అడ్డుపెట్టింది. భవన శిథిలాల కింద నలిగిపోయి ఆ తల్లి ప్రాణాలు కోల్పోగా, ఆమె ఒడిలో ఉన్న ఏడాది కూతురు అలానా మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. రెస్క్యూ టీమ్స్ ఆ బిల్డింగ్ అవశేషాలను తొలగించినప్పుడు ఈ అద్భుతం వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ చిన్నారిని చికిత్స కోసం కరాకస్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు.

Also Read : లండన్‌లో తెలంగాణ విద్యార్థి మృతి.. బర్త్‌డే పార్టీకి వెళ్లిన కొన్ని గంటలకే

భార్యను కోల్పోయిన తీవ్ర దుఃఖంలో ఉన్న మారిటిమో డి లా గ్వైరా జట్టు డిఫెండర్ హెక్టార్ బెల్లో.. తన భార్య జ్ఞాపకార్థం ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. “నువ్వే ఎప్పటికీ మా అందరి ఫేవరెట్ హీరోవి అమ్మీ.. నువ్వు ఎంత మంచిదానివో, నీ బిడ్డను ఎంతగా ప్రేమించావో ఆమెకు ఎప్పుడూ గుర్తిస్తూనే ఉంటాను” అని రాసుకొచ్చారు. తన చివరి శ్వాస వరకు బిడ్డను వదలకుండా, తన ప్రాణాలనే త్యాగం చేసి కూతురిని ఎలా కాపాడిందో ఆ కథను పెద్దయ్యాక తన బిడ్డకు చెప్తానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గుండె ముక్కలైన స్థితిలో ఉన్న హెక్టార్, ఆసుపత్రిలో ఉన్న తన చిన్నారి కూతురిని ఉద్దేశించి కూడా ఒక పోస్ట్ పెట్టారు. “నా బంగారు తల్లి.. నువ్వు బలంగా ఉండాలి. కొంచెం ఓపిక పట్టు. నా పగిలిపోయిన గుండెను మళ్లీ బాగుచేయడానికి నువ్వు నాకు చాలా అవసరం. ఇప్పుడు నీకు నీ నాన్న ఎప్పుడూ నవ్వుతూ, బలంగా కనిపించకపోవచ్చు.. కానీ నేను త్వరగా కోలుకుని నిన్ను ఈ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన అమ్మాయిగా మారుస్తానని ప్రామిస్ చేస్తున్నాను” అని పేర్కొన్నారు.

ఇకపై ఈ ప్రపంచంలో తామిద్దరమే మిగిలామని, తన భార్య ఆండ్రియా ఆకాశం నుండి తమను చూస్తూనే ఉంటుందని హెక్టార్ అన్నారు. ఒకవేళ తన భార్యకు మాట్లాడేందుకు ఒక్క నిమిషం సమయం దొరికినా.. ‘ఆమె ఎలాగైతే ప్రాణం పెట్టి కాపాడిందో, అలాగే కూతురిని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోమని’ చెబుతుందని భావిస్తున్నట్లు ఆయన రాశారు. కాగా, వెనిజులాలో సంభవించిన ఈ జంట భూకంపాల వల్ల భారీ వినాశనం జరిగింది. ఇప్పటివరకు అధికారికంగా 900 మందికి పైగా మరణించగా, వేలాది మంది ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి.

Also Read : పాకిస్తాన్‌లో భారీ భూకంపం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.