Idupu kayitham : ప్రియదర్శి హీరోగా సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్‌ వర్క్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇడుపు కాయితం. ఈ సినిమాతో యూట్యూబ్ స్టార్ నాగదుర్గ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. సుకుమార్‌ శిష్యుడు వంశీరెడ్డి దొండపాటి ఈ సినిమాకు డైరెక్టర్. తెలంగాణ కుటుంబ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైందీ ఈ చిత్రం. అయితే ఈ సినిమా టైటిల్ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.

ఆంధ్ర, తెలంగాణ నెటిజన్ల మధ్య పెద్ద భాషా వివాదానికి తెరలేపింది ఈ సినిమా టైటిల్. అందులోని తెలంగాణ యాస, భాషపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. “ఈ సినిమాకు ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ లేదా?”, “మీ భాష నుంచి మా భాషలోకి డబ్బింగ్ చేయరా?”, “అసలు మీది యాసనా.. భాషనా?” అంటూ కొందరు పెట్టిన వెటకారపు పోస్టులు, సెటైర్లు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి.

ఈ ట్రోలింగ్స్‌పై తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అత్యంత ఘాటుగా స్పందించారు. “ఎందుకురా మీకు ఇంత ఓర్వలేనితనం? అర్థంకాకపోతే మూసుకోండి. సబ్‌టైటిల్స్ కూడా ఉండవు.. నచ్చకపోతే సినిమా చూడకండి” అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : కొరటాల, బాలయ్య సినిమా షురూ.. మామ సినిమాకు అల్లుడు క్లాప్!

ప్రొఫెసర్ వ్యాఖ్యలతో పాటు తెలంగాణ నెటిజన్లు కూడా ఈ ట్రోల్స్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. మాది కేవలం యాస కాదు.. ఇది స్వచ్ఛమైన తెలంగాణ భాష అంటూ నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రాలో మాట్లాడే శ్రీకాకుళం, రాయలసీమ, నెల్లూరు వంటి ఇతర యాసలు అర్థమవుతున్నప్పుడు.. తెలంగాణ భాషే మీకు సమస్యగా మారిందా? దాదాపు 58 ఏళ్లు కలిసి ఉన్నా కనీసం తెలంగాణ భాష అర్థం కాలేదా? అంటూ ఎదురుప్రశ్నలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా తెలుగు డబ్బింగ్ కావాలనుకుంటే బీహార్ వెళ్లండి అంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో, ప్రస్తుతం ఈ ఇడుపు కాయితం సినిమా వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కొత్త ప‌దాల్ని క‌నిపెట్టక‌పోయినా ఫ‌ర్వాలేదు.. క‌నుమ‌రుగ‌వుతున్న ఇలాంటి ప‌దాల్ని బ‌య‌ట‌కు తీయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని మరికొందరు తెలంగాణ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : షాకింగ్‌… తల్లి కాబోతున్న సమంత?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.