
Phuket :థాయ్‌లాండ్‌లోని అత్యంత రమణీయమైన పర్యాటక ప్రాంతమైన ఫుకెట్ (Phuket) దాని పరిసర ప్రావిన్స్‌లలోని రియల్ ఎస్టేట్ రంగంలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. విదేశీయులు థాయ్ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, స్థానిక పౌరులను ‘నామినీ’లుగా (డమ్మీ షేర్ హోల్డర్లుగా) వాడుకుంటూ భూములు, లగ్జరీ విల్లాలను చేజిక్కించుకుంటున్న వ్యవహారంపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ (DSI) , డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ (DoBD) సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
థాయ్‌లాండ్ చట్టాల ప్రకారం విదేశీయులకు నేరుగా భూమిని కొనుగోలు చేసే హక్కు లేదు. ఈ నిబంధనను దాటవేయడానికి కొందరు విదేశీ పెట్టుబడిదారులు, స్థానిక లాయర్లతో చేతులు కలిపారు. ఎలాంటి ఆర్థిక స్థోమత లేని థాయ్ నిరుద్యోగులు, సాధారణ ఉద్యోగులు లేదా కంపెనీ డైరెక్టర్ల బంధువుల పేర్లను నామినీ షేర్‌హోల్డర్లుగా చూపిస్తూ వందలాది నకిలీ కంపెనీలను సృష్టించారు. ఈ కంపెనీల పేరిట విలాసవంతమైన విల్లాలు, హోటళ్లు, రిసార్టులు, ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తులను విదేశీయులు అక్రమంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
ఈ చట్టవిరుద్ధమైన ‘విల్లా ఆక్రమణ’ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న DSI, లోతుగా దర్యాప్తు జరిపి 31 మంది ప్రధాన అనుమానితుల పూర్తి వివరాలను, కేసు ఫైళ్లను పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సమర్పించింది. దీనికి తోడు, దక్షిణ థాయ్‌లాండ్‌లోని ఫుకెట్, ఫంగ్-న్గా, క్రాబీ ప్రావిన్స్‌లలో 500 మందికి పైగా భద్రతా సిబ్బందితో నిర్వహించిన భారీ దాడుల్లో 48 మంది నిందితులను (27 మంది థాయ్‌లు, 21 మంది విదేశీయులు) రౌండప్ చేశారు. ఈ ఆపరేషన్‌లో ఏకంగా 1 బిలియన్ బాత్‌ల (థాయ్ కరెన్సీ) కన్నా ఎక్కువ విలువైన ఆస్తులను అధికారులు సీజ్ చేయడం గమనార్హం.
ఈ తనిఖీల్లో వెలుగుచూసిన మరో విస్తుపోయే నిజం ఏమిటంటే.. ఈ నకిలీ నామినీ వ్యాపారాలకు, అంతర్జాతీయ ఆన్లైన్ జూదపు (గ్యాంబ్లింగ్) నెట్‌వర్క్‌లకు, మనీ లాండరింగ్ దందాలకు మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. బ్యాంకాక్‌లోని హువాయ్ ఖ్వాంగ్ జిల్లాలోని కొన్ని చైనీస్ రెస్టారెంట్లు, రొయ్యల పెంపకం కేంద్రాలలో సోదాలు చేయగా, అక్కడ ఆన్లైన్ జూదాన్ని ప్రమోట్ చేసే సామాగ్రి దొరికింది. అంతేకాకుండా, వ్యాపార లావాదేవీల సొమ్మును అధికారిక కార్పొరేట్ ఖాతాల్లోకి కాకుండా, నేరుగా విదేశీ డైరెక్టర్ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు.
ఫుకెట్ ఆస్తి మార్కెట్ ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక పెద్ద పెట్టుబడి వేదికగా మారింది. దుబాయ్ లేదా సింగపూర్‌లతో పోలిస్తే ఫుకెట్‌లో లగ్జరీ విల్లాలు లేదా కాండోల ధరలు మూడు రెట్లు తక్కువగా ఉండటంతో విదేశీయులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. సాన్సిరి, అసెట్ వైజ్ వంటి దిగ్గజ డెవలపర్లు ఇక్కడ భారీగా భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ఆస్తులపై పెట్టుబడి పెడితే ఏటా 5% నుండి 10% వరకు అద్దె రాబడి (ROI) వస్తుండటంతో, ప్రధాన తీరప్రాంత భూముల ధరలు 2004 నుండి ఇప్పటివరకు సగటున 7.47 రెట్లు పెరిగాయి. ముఖ్యంగా రావాయ్ బీచ్ ప్రాంతంలో భూమి ధరలు ఏకంగా 14 రెట్లు పెరగడం విశేషం.

అయితే, ఫుకెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వెనుక ఉన్న అసలు ‘రహస్యం’ ఏమిటంటే, ఇది కేవలం కొనుగోళ్ల మార్కెట్ మాత్రమే కాదు, ఇదొక పెద్ద అద్దెదారుల (Rental) సామ్రాజ్యం. మొత్తం మార్కెట్ డిమాండ్‌లో 71% వాటా దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక అద్దెలపైనే ఆధారపడి నడుస్తోంది. బాంగ్ టావో, లయాన్, ఫుకెట్ టౌన్ వంటి లోపలి భూభాగాల్లో ఉండే తక్కువ అంతస్తుల భవనాలు, కండోమినియంల నుండి నెలకు సగటున 35,000 బాత్‌ల స్థిరమైన అద్దె రాబడి వస్తుండటంతో డెవలపర్లు దీనిని నిశ్శబ్దంగా సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు కమలా, పటాంగ్ మధ్య ఉండే ‘మిలియనీర్స్ మైల్’ కొండప్రాంత ఆస్తులు కేవలం సంపదను దాచుకునే సాధనాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి.

అక్రమ ఆస్తుల వ్యవహారంతో పాటు, దేశంలోకి విదేశీయులను ఆకర్షిస్తున్న ‘ఎలైట్ వీసా’ (ప్రస్తుతం థాయిలాండ్ ప్రివిలేజ్ వీసా) నిబంధనలపై కూడా ప్రభుత్వం ఇప్పుడు పునఃపరిశీలన చేస్తోంది. థాయిలాండ్‌లో సుదీర్ఘకాలం నివసించేందుకు వీలు కల్పించే ఈ వీసాను కొందరు అంతర్జాతీయ నేరస్థులు, చట్టవిరుద్ధమైన వ్యాపారులు ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారి వీసాలను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. భవిష్యత్తులో ఈ దీర్ఘకాలిక బస అనుమతుల నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు.
ఈ అక్రమ నెట్‌వర్క్‌లను ఛేదించే క్రమంలో క్రాబీ ప్రావిన్స్‌లో ఒక ఆసక్తికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. పోలిష్ (పోలాండ్) పెట్టుబడిదారులకు లింక్ ఉన్న ‘ట్రోపికల్ హౌస్ కంపెనీ’ కేవలం 4 మిలియన్ బాత్‌ల రిజిస్టర్డ్ మూలధనంతో ఏకంగా 200 మిలియన్ బాత్‌ల విలువైన 16 పూల్ విల్లా ప్లాట్లను నియంత్రిస్తోంది. రికార్డులలో ఈ కంపెనీకి 100% థాయ్ యాజమాన్యం ఉన్నట్లు చూపించినప్పటికీ, అంతర్గతంగా దీనిని ఒక పోలిష్ జంట నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఫంగ్-న్గాలోని ‘సవా బీచ్ హోటల్’లో ఎలాంటి లైసెన్స్ లేకుండానే రోజువారీ బేసిస్‌పై విల్లాలను అద్దెకు ఇస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు కనుగొన్నారు.
థాయ్ చట్టాల ప్రకారం ఇటువంటి నామినీ స్కామ్‌లకు పాల్పడే విదేశీయులకు, అలాగే డబ్బుకు ఆశపడి తమ పేర్లను ప్రాక్సీలుగా వాడుకోవడానికి ఇచ్చే స్థానిక థాయ్ పౌరులకు చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఈ నేరం రుజువైతే గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష, లేదా 1,00,000 నుండి 10,000,000 బాత్‌ల వరకు భారీ జరిమానా, లేదా కొన్నిసార్లు ఈ రెండింటినీ కలిపి విధిస్తారు. ప్రస్తుతం పట్టుబడిన విదేశీయులలో ఇజ్రాయెల్, ఫ్రాన్స్, పోలాండ్, రష్యా, హాలండ్, స్విట్జర్లాండ్, బ్రిటన్,సౌత్ ఆఫ్రికా దేశస్తులు ఉన్నారు.
ఈ యాంటీ-నామినీ ఆపరేషన్,నిఘా కేవలం ఫుకెట్, క్రాబీ వంటి దక్షిణ ప్రావిన్స్లకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని థాయ్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విదేశీ ఇన్వెస్టర్ల ముసుగులో జరిగే ఎలాంటి అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధమైన రియల్ ఎస్టేట్ లావాదేవీల గురించైనా ప్రజలు వెంటనే రాయల్ థాయ్ పోలీస్ హాట్‌లైన్ 1599 కి సమాచారం అందించాలని కోరారు. చట్టబద్ధమైన లీజుహోల్డ్ లేదా 49% విదేశీ కోటా లోపు ఉండే కండోమినియం కొనుగోళ్ల వంటి సరైన మార్గాలను మాత్రమే విదేశీ పెట్టుబడిదారులు ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు









