HYDRA: వ‌ర‌ద‌ల క‌ట్ట‌డితో పాటు.. భూగ‌ర్భ జ‌లాల‌ను పెంపొందించాల‌నే ల‌క్ష్యంతో చేప‌ట్టిన చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌లో మ‌రో 4 చెరువుల ప‌నుల‌కు హైడ్రా గురువారం శ్రీ‌కారం చుట్టింది. ఐటీ కారిడార్‌కు చేరువ‌లోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం ఇబ్ర‌హీంబాగ్ లోని ఇబ్ర‌హీం పెద్ద చెరువు, గండిపేట మండ‌లం, పుప్పాల‌గూడ‌లోని భ‌గీర‌థ‌మ్మ చెరువు, కూక‌ట్‌ప‌ల్లి మండ‌లం మూసాపేట‌లోని కాముని చెరువుతో పాటు మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా  లోని కాప్రా చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులను హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్  ప్రారంభించారు.

ఇబ్ర‌హీం చెరువుతో పాటు.. కాముని చెరువుల వ‌ద్ద హైడ్రా కమిష‌న‌ర్ భూమి పూజ చేసి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. స్థానికులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని చెరువుల‌ను అభివృద్ధి చేస్తున్నందుకు హైడ్రాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. చెరువు అభివృద్ధితో మురుగు స‌మ‌స్య‌తో పాటు.. దోమ‌ల బెడ‌ద త‌ప్పించ‌డ‌మే కాకుండా.. ఈ ప్రాంతాలు ఆహ్లాదంగా మారుస్తున్నందుకు రాష్ట్ర ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాముని చెరువును 48 ఎక‌రాలు, ఇబ్ర‌హీం పెద్ద‌చెరువు 97 ఎక‌రాలు, 54 ఎక‌రాల్లో భ‌గీర‌థ‌మ్మ చెరువు, 112 ఎక‌రాల్లో కాప్రా చెరువును అభివృద్ధి చేస్తున్నారు. ఈ నాలుగు చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు రూ. 107 కోట్లు వెచ్చిస్తున్నారు.
 వ‌ర‌ద క‌ట్ట‌డికి వీలుగా చెరువులు..
చెరువుల్లో పూడిక‌ను మొత్తం తొల‌గించి.. దుర్గంధం పోయేలా చూడాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు చేప‌ట్టిన కాంట్రాక్ట‌ర్ల‌కు సూచించారు. వ‌ర‌ద‌ల క‌ట్ట‌డితో పాటు.. భూగ‌ర్భ జ‌లాలు పెంపుద‌ల ల‌క్ష్యంగా చెరువుల‌ను అభివృద్ధి చేయాల‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఆకాంక్షించారు.
చెరువులోకి వ‌ర‌ద నీరు సాఫీగా వ‌చ్చేలా ఇన్‌లెట్లు, బ‌య‌ట‌కు వెళ్లేలా ఔట్‌లెట్లు అభివృద్ధి చేయాల‌న్నారు. మొద‌టి విడ‌త అభివృద్ధి చేసిన 6 చెరువుల మాదిరే రెండో విడ‌త చేప‌ట్టిన 14 చెరువుల‌ను తీర్చిదిద్దాల‌ని.. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా చేయాల‌న్నారు. చెరువుచుట్టూ పాత్‌వేలు, అన్ని వ‌య‌సుల‌వారూ సేద‌దీరేలా ఏర్ప‌ట్లు చేయ‌డంతో పాటు.. ఓపెన్ జిమ్‌లు, పిల్ల‌ల ప్లే ఏరియాలు ఇలా ఒక ప‌ర్యాట‌క కేంద్రంగా మార్చాల‌న్నారు. పెద్ద చెరువుల్లో ప‌ర్యాట‌క శాఖ ద్వ‌రా బోటింగ్ వ్య‌వ‌స్థ కూడా అందుబాటులోకి వ‌చ్చేలా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌ల‌కు రూపొందిస్తోంద‌న్నారు.  చెరువుల అభివృద్ధిలో స్థానికులు ప్ర‌ధాన పాత్ర పోషించాల‌ని సూచించారు. అభివృద్ధి ప‌నులు బాగా జ‌రిగేలా స‌హ‌క‌రించాల‌న్నారు.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.