Madras High Court : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద సుదీర్ఘకాలం పనిచేసినంత మాత్రాన ప్రభుత్వ ఉద్యోగ క్రమబద్ధీకరణకు (Permanent Job) ఎలాంటి హక్కు లభించదని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక పురోగతి , క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ పథకాలు నిరంతరం మారుతూ ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక పశువైద్యశాలలో దాదాపు తొమ్మిదేళ్లుగా స్కావెంజర్‌గా పనిచేస్తూ, తన ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ కేసును విచారించిన జస్టిస్ బి. పుగలేంది.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది ఒక క్రమబద్ధమైన నియామక ప్రక్రియ ద్వారా మాత్రమే జరగాలని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల కింద తాత్కాలికంగా పొందే ఉపాధికి, పబ్లిక్ సర్వీస్ నియామకాలకు మధ్య స్పష్టమైన తేడా ఉంటుందని కోర్టు పేర్కొంది. ఒక వ్యక్తి కేవలం సుదీర్ఘకాలం పాటు తాత్కాలికంగా కొనసాగినంత మాత్రాన, సదరు ఉద్యోగాన్ని శాశ్వతం చేయాలని కోరే చట్టపరమైన హక్కు వారికి సంక్రమించదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
2006లో ప్రారంభమైన ఉపాధి హామీ పథకం.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడానికి, ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల నైపుణ్యం లేని శ్రమతో కూడిన పనులను గ్యారెంటీగా కల్పించేందుకు ఉద్దేశించబడింది. నాటి కాలంలో చెరువుల్లో పూడికతీత, కాలువలు తవ్వడం, పిచ్చిమొక్కల తొలగింపు వంటి పనులకు భారీగా మానవ శ్రమ అవసరమయ్యేది. కానీ, నేటి ఆధునిక కాలంలో అధునాతన యంత్రాల (Mechanisation) సాయంతో ఆ పనులన్నింటినీ తక్కువ సమయంలో ఎంతో సమర్థవంతంగా పూర్తి చేయవచ్చని కోర్టు గుర్తుచేసింది.
ఒకప్పుడు వందలాది మంది కార్మికులు రోజులు తరబడి చేసే పనిని, ప్రస్తుతం ఒక శిక్షణ పొందిన మెషిన్ ఆపరేటర్ కొద్ది గంటల్లోనే పూర్తి చేయగలుగుతున్నాడు. ఇటువంటి తరుణంలో, యంత్రాల ద్వారా సులభంగా చేయగలిగే పనులకే ఇంకా కార్మికులను పరిమితం చేయడం కంటే.. మానవ శ్రమకు నిజమైన డిమాండ్ ఉన్న వ్యవసాయం వంటి ఉత్పాదక రంగాల వైపు ఈ కూలీలను ఎందుకు మళ్లించకూడదని విధాన నిర్ణేతలను (Policymakers) హైకోర్టు ప్రశ్నించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తమిళనాడులోని రైతాంగం తీవ్రమైన వ్యవసాయ కూలీల కొరతను ఎదుర్కొంటోంది. ఒకవేళ ఉపాధి హామీ కార్మికులను ఒక గ్రామీణ ప్రభుత్వ పశువైద్యశాల దైనందిన పనుల కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు.. అదే కార్మికులను వ్యవసాయ రంగంలో ఉత్పాదక పనుల కోసం ఎందుకు వినియోగించకూడదో ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోర్టు సూచించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించి.. కూలీల వేతన భారాన్ని ప్రభుత్వం, సదరు రైతు పరస్పరం పంచుకునే (Wage sharing) సరికొత్త నమూనాను పరిశీలించవచ్చని అభిప్రాయపడింది. దీనివల్ల రైతులకు కూలీల కొరత తీరడమే కాకుండా, ప్రభుత్వ ఖజానాపై కూడా భారం తగ్గుతుందని పేర్కొంది.
ఈ మార్పులకు సంబంధించిన కార్యాచరణ, అర్హత నిబంధనలు, దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు , కార్మికుల ప్రయోజనాల రక్షణ వంటి అంశాలు పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణేతలు, నిపుణుల పరిధిలోనివని కోర్టు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఉపాధి హామీ పథకంపై సరికొత్త పాలసీ స్థాయిలో సమీక్ష జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు పేర్కొంది. సాంకేతికతను వాడుకుంటూనే, లభ్యమవుతున్న మానవ వనరులను కార్మికులు, రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చేలా మార్చాలని మద్రాస్ హైకోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వానికి హితవు పలికింది.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.