
jellyfish : ఇరాన్ సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అమెరికాకు చెందిన అధునాతన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం కూలిపోయింది. అయితే ఈ విమానం కూలిపోవడానికి వెనుక సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో లాగా కనిపించే వింత డ్రోన్ల సమూహం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ విమానం నుండి సురక్షితంగా బయటపడిన అమెరికా పైలట్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆకాశంలో చాలా డ్రోన్లు ఒకదానికొకటి కలిసిపోయి, జెల్లీఫిష్ చేప ఆకారంలో కదులుతూ కనిపించాయి. ఈ వింత సాంకేతికతను చూసిన సదరు పైలట్, ఇది నిజంగా గ్రహాంతరవాసుల పనిలా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలోనే ఇరాన్ చేతిలో ఒక యుద్ధ విమానం కూలిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే అమెరికా కమాండోలు ఇరాన్ సరిహద్దుల్లోకి వెళ్లి సాహసోపేతంగా పైలట్‌ను రక్షించారు. మొదట్లో ఈ విమానం ఇరాన్ క్షిపణుల వల్ల కూలిపోయి ఉంటుందని భావించారు. కానీ పైలట్ ఇచ్చిన స్టేట్మెంట్ అమెరికా నిఘా వర్గాలను ఆలోచనలో పడేసింది. ఆకాశంలో పెద్ద డ్రోన్ల కింద చిన్న చిన్న డ్రోన్లు కాళ్లలా వేలాడుతూ, ఒక గాల్లో తేలే మైన్ఫీల్డ్ లాగా ఉన్నాయని పైలట్ చెప్పారు. అయితే, ఆ సమయంలో ప్రమాదం వల్ల పైలట్ తలకు దెబ్బతగలడం, అలాగే అంతకుముందు కువైట్ విమానాలతో జరిగిన పొరపాటు కాల్పుల్లో కూడా ఆయన విమానం కూలిపోవడంతో, నిఘా అధికారులు ఈ విషయాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నారు.
ఇరాన్ చేతికి కూడా వచ్చినట్లే
సాంకేతిక పరిభాషలో దీనిని మెష్ నెట్వర్కింగ్ అంటారు. దీని ద్వారా ఒక పెద్ద మదర్షిప్ డ్రోన్ నియంత్రణలో వందలాది చిన్న డ్రోన్లు ఒకదానికొకటి అనుసంధానమై ఒకే జీవిలా కదులుతాయి. ఒకవేళ పైలట్ చెప్పింది నిజమే అయితే, ఇప్పటివరకు కేవలం చైనా, రష్యా దగ్గర మాత్రమే ఉన్న ఈ అత్యంత అధునాతన సాంకేతికత ఇప్పుడు ఇరాన్ చేతికి కూడా వచ్చినట్లే అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. చైనా సహాయంతో ఇరాన్ ఈ టెక్నాలజీని సొంతం చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ జెల్లీఫిష్ డ్రోన్ల సమూహం శత్రు దేశాల రాడార్లకు దొరకకుండా చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించగలదు. ఒకవేళ దాడిలో కొన్ని డ్రోన్లు ధ్వంసమైనా, మిగిలిన డ్రోన్లు వాటి స్థానాన్ని భర్తీ చేసుకుంటూ దాడిని కొనసాగించగలవు. ఇది శత్రువుల గుండెల్లో భయాన్ని పుట్టించే ఒక మానసిక ఆయుధంగా కూడా మారుతోంది. ఈ రకమైన డ్రోన్ల నుండి రక్షణ పొందాలంటే అమెరికా కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డ్రోన్ల గురించి ఇరాన్ మాత్రం స్పష్టంగా ఏమీ చెప్పలేదు, తాము ఒక కొత్త వైమానిక రక్షణ వ్యవస్థను వాడామని మాత్రమే ప్రకటించింది. పైలట్ చూసింది నిజమా లేక భ్రమనా అనేదానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.









