trisha

Trisha : తమిళనాడులోని శివగంగ జిల్లా కారైకుడి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశంలో నిన్న ఒక వింత గొడవ జరిగింది. సాధారణంగా ఇలాంటి మీటింగ్‌లలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలి, కానీ నిన్న మాత్రం అక్కడ ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టడంపై పెద్ద రచ్చే నడిచింది.

మీటింగ్ మొదలవ్వగానే అధికార పార్టీ డిఎంకె కౌన్సిలర్లు లేచి.. “రాష్ట్రంలోని చాలా కార్పొరేషన్ ఆఫీసుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ ఫోటోతో పాటు మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా ఉన్నాయి. కాబట్టి మన ఆఫీసులో కూడా మాజీ సీఎం స్టాలిన్ ఫోటో పెట్టాలి అంటూ గొడవ మొదలుపెట్టారు. వీరికి పోటీగా ప్రతిపక్షం అన్నాడీఎంకే కౌన్సిలర్లు కూడా లేచి, తమ మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎడప్పాడి పళనిస్వామిల ఫోటోలను తెచ్చి టేబుల్‌పై పెట్టారు. దాంతో డిఎంకె డిప్యూటీ మేయర్ గుణశేఖరన్, మిగిలిన కౌన్సిలర్లు కలిసి స్టాలిన్ ఫోటోను కూడా అక్కడ గోడకు తగిలించారు. దీనితో ఆ హాల్‌లో జయలలిత, ఎడప్పాడి, స్టాలిన్, ప్రస్తుత సీఎం విజయ్ ఫోటోలు లైన్‌గా కొలువుదీరాయి.

ఈ క్రమంలో 11వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ మెయ్యర్ అనే వ్యక్తికి అకస్మాత్తుగా ఒక వింత ఆలోచన వచ్చింది. ఆయన గబుక్కున సీట్లోంచి లేచి నిలబడి.. “ఈ నాయకుల ఫోటోల పక్కనే సినిమా హీరోయిన్ త్రిష ఫోటోను కూడా పెట్టాలి అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అంతేకాదు.. గత ఎన్నికల్లో నటి త్రిష వల్లే తమిళనాడులో ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒకవేళ ఆఫీసులో త్రిష ఫోటో పెట్టకపోతే ఇక్కడ హింస చెలరేగుతుంది, గొడవలు అవుతాయి అని ఆయన చాలా సీరియస్‌గా డైలాగులు చెప్పారు.

ఆయన చెప్పిన మాటలు విన్న హాల్లోని మిగతా కౌన్సిలర్లు, అధికారులు ఒక్కసారిగా నవ్వాపుకోలేక పడి పడి నవ్వారు. అంతటితో ఆగని ఆ కౌన్సిలర్.. ఇక్కడ త్రిష ఫోటో పెట్టడానికి అస్సలు ఖాళీ స్థలం లేదు. కాబట్టి ఆమె ఫోటో తగిలించడానికి ప్రత్యేకంగా చోటు కేటాయించాలి అంటూ మళ్లీ గొడవ చేయడంతో ఆ మీటింగ్‌లో కాసేపు నవ్వులు, మరికాసేపు గందరగోళం నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.