Mahua Moitra : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ముక్కలు ముక్కలుగా విడిపోతున్న తరుణంలో.. ఆ పార్టీ లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిపై ఆమె ఊహించని విధంగా ప్రశంసలు కురిపించారు. తామిద్దరం ఇప్పుడు వేర్వేరు రాజకీయ మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ, సువేందుతో తనకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉందని ఓ ఇంటర్వ్యూలో మహువా మోయిత్రా చెప్పుకొచ్చారు.

మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న మహువా మోయిత్రా.. ఇప్పుడు సువేందు అధికారిని పొగడటం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే మమతా బెనర్జీ తన పార్టీపై పట్టు కోల్పోతున్నారు. మరోవైపు రితాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం మమతకు సవాల్ విసురుతోంది. పార్లమెంట్‌లో కూడా తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై, అధికార బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మహువా మోయిత్రా నోట సువేందు మాట రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Also Read : ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో త్రిష ఫొటో ఉండాల్సిందే.. కౌన్సిలర్ డిమాండ్!

సీఎం సువేందు అధికారితో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మేమిద్దరం టీఎమ్‌సీలో కలిసి ఉన్నప్పుడు ఆయన నాకు ఎంతో మద్దతుగా నిలిచారని మహువా మోయిత్రా గుర్తుచేసుకున్నారు. తన రాజకీయ జీవితంలో ఎదురైన ఒక కష్టమైన పరిస్థితిని ఆమె వివరించారు. “2014 లోక్‌సభ ఎన్నికల్లో నాకు సీటు వస్తుందని ఆశించాను, కానీ రాలేదు. దాంతో నేను బాధతో రాత్రంతా ఏడ్చాను. ఆ సమయంలో సువేందు నా దగ్గరకు వచ్చి ఓదార్చారు, ధైర్యం చెప్పారు అని మహువా పేర్కొన్నారు. అలాగే 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కరీంపూర్ నుండి తొలిసారి పోటీ చేసినప్పుడు, టీఎమ్‌సీలోని ఏ సీనియర్ నాయకుడూ తన తరపున ప్రచారానికి రాలేదని.. కానీ సువేందు అధికారి వచ్చి తన కోసం మొదటి ర్యాలీ నిర్వహించారని, ఇప్పటికీ ఆ ఫోటోలు తన దగ్గర ఉన్నాయని ఆమె చెప్పారు.

Also Read : లోకల్ ట్రైన్‌లో దారుణ హత్య.. డోరు మూసే విషయంలో గొడవై..

ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు

ప్రస్తుతం తామిద్దరం ఎక్కువగా మాట్లాడుకోవడం లేదని, కానీ పార్టీలు మారినంత మాత్రాన పాత సాయాన్ని మర్చిపోలేనని మహువా మోయిత్రా స్పష్టం చేశారు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్‌ను శుద్ధి చేసినందుకు సువేందు అధికారికి ఆమె పరోక్షంగా కృతజ్ఞతలు తెలిపారు. మమతా బెనర్జీ చేయలేని పనిని సువేందు, బీజేపీ కలిసి ఒకే రోజులో చేసేశారని వ్యాఖ్యానించారు. పనికిరాని నాయకులను కూడా మమత పార్టీలో భరిస్తూ వచ్చారని, వారు సొంతంగా గెలవగలరా లేదా అని ఆమె ఎప్పుడూ ఆలోచించలేదని విమర్శించారు.

టీఎమ్‌సీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారాన్ని మోయిత్రా పూర్తిగా ఖండించారు. సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌కు దగ్గరైనప్పటికీ, విలీనం వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. మహువా మోయిత్రా పార్టీ మారుతున్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వనప్పటికీ, ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తెరలేపాయి. ప్రస్తుతం టీఎమ్‌సీలోని 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది తిరుగుబాటు వర్గంలోనే ఉన్నారని సమాచారం. నిన్నటివరకు మమతకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న అరూప్ బిశ్వాస్, ఫిర్హాద్ హకీమ్ వంటి సీనియర్ నేతలు కూడా ఇప్పుడు రెబల్ గ్రూప్‌లో చేరిపోవడం గమనార్హం.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.